
పద్మారావునగర్, వెలుగు: గాంధీ మెడికల్‌కాలేజీ 71వ ఫౌండేషన్‌డే ఆదివారం కళాశాల ఆలుమ్ని అసోసియేషన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ డి.రాజారెడ్డి హాజరయ్యారు.
కాలోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వైస్ చైర్మన్ డాక్టర్ పీవీ.నందకుమార్ రెడ్డి, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ కె.మహేశ్, జీఎస్టీ అడిషనల్ కమిషనర్ డాక్టర్ దొంతి గాంధీ, కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.ఇందిర, గాంధీ హాస్పిటల్సూపరింటెండెంట్ డాక్టర్ వాణి అతిథులుగా హాజరయ్యారు. గాంధీ ఆలుమ్ని అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ జీఆర్.లింగమూర్తి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎ.వెంకటరత్నం అధ్యక్షతన జరిగిన వేడుకల్లో రిటైర్డ్ ప్రొఫెసర్లు సుధారమణి, అరవింద్ కుమార్, అశోక్ కుమార్ ను సన్మానించారు.
గాంధీ మెడికల్ కాలేజీ వివిధ విభాగాల్లో యూజీ, పీజీ, సూపర్ స్పెషాలిటీలో మెరిట్ సాధించిన 64 మంది విద్యార్థులకు గోల్డ్‌మెడల్స్, ప్రశంసా పత్రాలను అందించారు. పేద వైద్య విద్యార్థులకు స్కాలర్ షిప్ ఇవ్వడానికి కొందరు పూర్వ విద్యార్థులు తమ వంతుగా రూ.20 లక్షలను అసోసియేషన్ కు అందజేశారు.
దవాఖాన సూపరింటెండెంట్ వాణి మాట్లాడుతూ.. హాస్పిటల్‌లోని కొన్ని విభాగాల్లో వైద్య పరికరాలు అవసరం ఉన్నాయన్నారు. పూర్వ విద్యార్థులు స్పందిస్తూ.. వాటిని తాము సమకూరుస్తామని పేర్కొన్నారు.