- తీవ్ర అభ్యంతరం తెలిపిన బీజేపీ సభ్యులు
- నేను హిందువును కాదా.. నేను బొట్టుపెట్టుకోలేదా: మంత్రి పొన్నం
- మతం పేరుతో రాజకీయాలు మానుకోవాలని మంత్రి వాకిటి హితవు
- బడ్జెట్‌పై చర్చ పక్కదారి
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చకు బదులు మహాత్మా గాంధీ, గాడ్సేపై కాసేపు చర్చ జరిగింది. ఈ అంశంపై బీజేపీ, కాంగ్రెస్ లీడర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. సుమారు అరగంట పాటు చర్చ పక్కదారి పట్టింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మంగళవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు ముగిసిన తర్వాత మధ్యాహ్నం 12.30 గంటలకు బడ్జెట్‌పై మాట్లాడే అవకాశాన్ని బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డికి ఇచ్చారు. ఆయన ఒక్కో శాఖ గురించి మాట్లాడుకుంటూ వచ్చి ఉపాధి హామీ పనుల ప్రస్తావన తెచ్చారు. గతంలో100 రోజుల పాటు ఉన్న ఉపాధి హామీ పనులను కేంద్రం 125 రోజులకు పెంచిందని, చేసిన పనులకు డబ్బులను 15 రోజుల్లోగా చెల్లించకపోతే వడ్డీతో సహా చెల్లించాలని చట్టంలో కేంద్రం మార్పులు తీసుకొచ్చిందని చెప్పారు.
ఆ సమయంలో మంత్రి సీతక్క జోక్యం చేసుకొని ఉపాధి హామీ చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని, దానికి స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చిన జాతిపిత మహాత్మా గాంధీ పేరు పెడితే కేంద్ర ప్రభుత్వం కావాలని గాంధీ పేరు తొలగించిందని మండిపడ్డారు. గతంలో ఈ పథకంలో 100 శాతం నిధులను కేంద్రమే భరించగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం వాటా ఖర్చు చేయాలని చట్టంలో మార్పులు తీసుకురావడం వల్ల కేంద్రం 75 రోజులు మాత్రమే కూలీలకు పని కల్పించినట్లవుతందన్నారు.
‘గాంధీజీని కూడా మీరు తిడుతున్నారు.. గాంధీని కాల్చి చంపిన గాడ్సేను గొప్ప లీడర్‌గా కీర్తిస్తున్నారు’ అంటూ సీతక్క మండిపడ్డారు. గాడ్సే ఆర్ఎస్ఎస్ లీడర్ కావడం వల్ల ఆయనను గొప్ప పోరాట యోధుడుగా చిత్రీకరిస్తున్నారని ఎద్దేవా చేశారు. సీతక్క మాట్లాడుతుండగా బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలంతా ఆమె మాటలకు అడ్డుతగిలారు. గాడ్సేను ఆర్ఎస్ఎస్ లీడర్ అని ఎట్లా చెబుతారని, గాడ్సేకు ఆర్ఎస్ఎస్లో సభ్యత్వం లేదని, ఆయనకు ఆర్ఎస్ఎస్కు సంబంధం లేదని స్వయంగా సుప్రీం కోర్టు ప్రకటించిన విషయాన్ని బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి గుర్తుచేశారు.
వెంటనే మంత్రి పొన్నం ప్రభాకర్ జోక్యం చేసుకొని అసెంబ్లీలో కొన్ని శ్లోకాలు చదివారు. ‘నాలా మీరు శ్లోకాలు చదువుతారా.. చదవండి.. నేను హిందువును కాదా.. నేను బొట్టుపెట్టుకోలేదా.. గుడికి పోనా.. పూజలు చేయనా.. బీజేపోళ్లకు మాత్రమే హిందువులంటే ప్రేమ ఉన్నదని నాటకాలు ఆడటం ఎందుకు.. హిందువుల పేర్లతో ఇంకా ఎన్నేండ్లు రాజకీయం చేస్తరు.. ఇకనైనా మానుకోండి’ అని చురకలంటించారు. తర్వాత మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. గాంధీని చంపింది గాడ్సేనా? కాదా? అని ప్రశ్నించారు. ‘మేమంతా పుట్టింది హిందూ మతంలోనే.. చచ్చేది హిందూ మతంలోనే’ అని పేర్కొన్నారు. మతం అనేది ఆచరణలో ఉండాలి కానీ ఆ పేరుతో రాజకీయాలు చేయకూడదన్నారు.
ఆర్ఎస్ఎస్ను సస్పెండ్ చేసిన సర్దార్ వల్లాభాయ్ పటేల్‌ను కీర్తిస్తున్న బీజేపీ వాళ్లు.. మహాత్మా గాంధీ పట్ల చిన్న చూపు చూపడం ఎందుకని ప్రశ్నించారు. బడ్జెట్‌పై చర్చిస్తున్న సమయంలో హిందూ, ముస్లింల చర్చ ఎందుకు తెచ్చారో తమకు అర్థం కావట్లేదని బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. విషయాన్ని సైడ్ ట్రాక్ పట్టించడానికి మంత్రులు అవసరంలేని చర్చ పెట్టారని విమర్శించారు. బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా సంక్షేమ శాఖలకు నిధులు తగ్గించి ముస్లిం మైనార్టీలకు రూ.3 వేల కోట్లకు పైగా ఎందుకు పెంచారో సమాధానం చెప్పాలని ముగించారు.
