
వరుసగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ శివారులోని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో శుక్రవారం (సెప్టెంబర్ 26) గండిపేట్ (ఉస్మాన్ సాగర్) గేట్లు ఓపెన్ చేసి నీళ్లు దిగువకు వదులుతున్నారు. మధ్యాహ్నం మధ్యాహ్నానికి ఉస్మాన్ సాగర్ జలాశయం 10 గేట్లను ఎత్తి 6 వేల370 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదులుతున్నట్లు అధికారులు తెలిపారు.
గండిపేట్ గేట్లు ఎత్తడంతో నార్సింగి రూట్లో లో లెవెల్ బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అదే విధంగా వరద ఉధృతిని దృష్టిలో ఉంచుకుని నార్సింగి ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్ఆర్) తో పాటు సర్వీస్ రోడ్లను మూసివేశారు. ఆ రూట్లో వెళ్లే వాహనదారులు మరో రూటు చూసుకోవాలని సూచించారు. రాజేందర్ నగర్ నుంచి ఓఆర్ సర్వీస్ రోడ్లు మూసివేయడంతో అటువైపు ఎవరినీ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు పోలీసులు.
నిండు కుడల్లా జంట జలాశయాలు:
భారీ వర్షాల కారణంగా నగర శివారు జంట జలాశయాల్లో కి గంట గంటకు వరద నీరు చేరుతోంది. దీంతో జలమడలి అధికారులు గేట్లను ఎత్తి వరద నీటిని దిగువన మూసిలోకి వదులుతున్నారు. ఉస్మాన్ సాగర్ నీటిని వదిలిన అధికారులు.. ఆ తర్వాత హిమాయత్ సాగర్ నుంచి 5 గేట్ల ద్వారా 5 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు జలమండలి DGM గోవింద్ గౌడ్ తెలిపారు.
ఈ ప్రాంతాల ప్రజలకు అలర్ట్:
వరద నీటిని మూసి లోకి వదులుతున్న క్రమంలో హిమాయత్ సాగర్, దర్గా ఖలీల్ ఖాన్, బండ్లగూడ జాగిర్, హైదర్ షా కోట, గంధం గూడ, బైరాగి గూడ గ్రామాలు, కాలనీలలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసినట్లు బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ తెలిపారు.
►ALSO READ | ప్రజలను అప్రమత్తం చేయండి: కలెక్టర్లకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
ఎక్కడ ఇబ్బందు లు తలెత్తినా వెంటనే సహాయ చర్యలు చేపట్టేందుకు మున్సిపాలిటీ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం ను సిద్ధం చేసినట్లు ఆయన వివరించారు. భారీగా కురుస్తున్న వర్షాల పద్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతేనే బయటికి వెళ్లాలని ఆయన సూచించారు.
ప్రమాదకర స్థాయిలో ముసారంబాగ్ బ్రిడ్జి:
ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి 10 వేల క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదులుతుండటంతో అధికారులు మూసీ ప్రభావిత ప్రాంతాల్లో అధికారుల అలెర్ట్ ప్రకటించారు. భారీ వరదతో ముసారాంబాగ్ బ్రిడ్జిపై వరద ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. బ్రిడ్జికి ఆనుకుని నీళ్లు వెళ్తుండటంతో అధికారులు రాకపోకలు నిలిపివేశారు.