గణేష్ నిమజ్జనం.. 19వేల సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు

గణేష్ నిమజ్జనం.. 19వేల సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు

పండుగ చివరి రోజైన అనంత చతుర్దశి పవిత్ర సందర్భంగా గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేయడానికి ఊరేగింపులు చేపట్టే సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముంబయి పోలీసులు అధికారులతో సహా 19,000 మందికి పైగా సిబ్బందిని మోహరించారు. శుక్రవారం సైతం ఊరేగింపులు కొనసాగడం, ఆ రోజే ఈద్-ఇ-మిలాద్ రావడంతో భద్రతా ఏర్పాట్లను మరింత ముమ్మరం చేశారు. పోలీసులు చేసిన విజ్ఞప్తి మేరకు అనంత చతుర్దశి దృష్ట్యా గురువారం కాకుండా ఈద్-ఈ-మిలాద్ ఊరేగింపులను నిర్వహించాలని వివిధ ముస్లిం సంస్థలు, మత పెద్దలు నిర్ణయించారు.

భద్రతా విధుల్లో ఉండే పోలీసు సిబ్బంది..

  •     16,250 మంది కానిస్టేబుళ్లు
  •     2,866 మంది అధికారులు
  •     45 అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ACP)
  •     25 డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (DCP)
  •     8 అదనపు పోలీసు కమిషనర్లు
  •     ఇతర సీనియర్ అధికారులు

అంతేకాకుండా, స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (SRPF), ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF), క్విక్ రెస్పాన్స్ టీమ్స్ (QRTలు),  హోంగార్డుల యొక్క 35 ప్లాటూన్లు ముంబై నగరంలోని అన్ని ముఖ్యమైన ప్రదేశాలలో ఉంటాయి. ఈ క్రమంలో పోలీసు సిబ్బంది అందరి సెలవులు రద్దు చేశారు. మెడికల్ లీవ్‌లో ఉన్నవారు మినహా మిగతా పోలీసులందరూ విధుల్లో ఉంటారని అధికారులు తెలిపారు. "అనంత్ చతుర్దశి రోజున 'గణపతి బప్పా'కి వీడ్కోలు పలికేందుకు పెద్ద సంఖ్యలో ముంబైవాసులు వీధుల్లోకి వస్తుండటంతో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముంబై పోలీసులు సిబ్బందిని మోహరించి సిద్ధంగా ఉన్నారు" అని ఓ అధికారి వెల్లడించారు.