అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు.. 216 గ్రాముల గోల్డ్, 9 బైక్ లు రికవరీ

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు.. 216 గ్రాముల గోల్డ్, 9 బైక్ లు రికవరీ

ఖమ్మం టౌన్,వెలుగు : తెలంగాణ, ఏపీలో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను ఖమ్మం సీసీఎస్, సత్తుపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఖమ్మంలోని ప్రకాశ్  నగర్ లో ఉన్న కమిషనర్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ సునీల్ దత్  వివరాలు వెల్లడించారు. తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకున్నామని ఆయన పేర్కొన్నారు. ‘‘మందమర్రి మండలం మంగలివాడకు చెందిన భీమిలి రాజ్ కుమార్  అలియాస్  టిల్లు, సత్తుపల్లి మండలం రాజా నగరానికి చెందిన నల్లేలా అనిల్ కుమార్, హైదరాబాద్  మెహిదిపట్నానికి చెందిన మచ్చ ఆదర్శ్  దొంగల ముఠాగా ఏర్పడ్డారు.

గతంలో దొంగతనాలకు పాల్పడుతూ జువెనైల్  హోంకు వెళ్లి వచ్చారు. అక్కడ ముగ్గురూ స్నేహితులుగా మారారు. నిరుడు డిసెంబర్ 20న సత్తుపల్లి మండలం బెతుపల్లిలో టీఎస్ఎస్పీ 15 వ బెటాలియన్ లో  హెడ్  కానిస్టేబుల్  కోరం లక్ష్మణ్ రావు ఇంట్లో బంగారం, నగదు దొంగిలించారు. వారి వద్ద నుంచి 13 లక్షలు విలువ చేసే 216 గ్రాముల బంగారు నగలు, తొమ్మిది మోటార్ సైకిళ్లను రికవరీ చేశాం” అని సీపీ వివరించారు. మొత్తం ప్రాపర్టీ విలువ 22 లక్షలు ఉంటుందని ఆయన చెప్పారు. దొంగిలించిన బంగారాన్ని సత్తుపల్లి రామనగర్ కు చెందిన తోట నరేశ్  సహకారంతో ప్రైవేట్ ఫైనాన్స్ లో తాకట్టు పెట్టేవారని సీపీ వెల్లడించారు.