- సిమ్‌కార్డులు, బ్యాంక్ అకౌంట్స్ కోసం దేశంలో నెట్‌వర్క్
- రాష్ట్రంలో ముగ్గురు సప్లయర్స్‌ను అరెస్ట్ చేసిన టీజీ సీఎస్‌బీ
- 113 సిమ్ కార్డులు స్వాధీనం
హైదరాబాద్, వెలుగు: విదేశాల్లోని సైబర్ నేరగాళ్లకు సిమ్ కార్డులు, బ్యాంక్ అకౌంట్స్ సప్లయ్ చేస్తున్న ముఠా గుట్టురట్టు అయ్యింది. దుబాయ్, థాయిలాండ్, కాంబోడియాకు సిమ్‌కార్డులు, బ్యాంక్ అకౌంట్స్ తరలిస్తున్న ముగ్గురిని రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో(సీఎస్‌బీ) అధికారులు మంగళవారం అరెస్ట్ చేశారు. 113 సిమ్ కార్డులు, మూడు సెల్‌ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. బుధవారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. దుబాయ్ కేంద్రంగా చైనా సైబర్ నేరగాళ్లు సేకరిస్తున్న సిమ్‌కార్డులు, బ్యాంక్ అకౌంట్స్ దందా వివరాలను సీఎస్‌బీ డైరెక్టర్ శిఖా గోయల్ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.
దుబాయ్‌లో చైనీస్ కాల్ సెంటర్లు
యూపీకి చెందిన విజయ్‌కుమార్ అనే సైబర్ నేరగాడు దుబాయ్‌లో నివాసం ఉంటున్నాడు. చైనీ స్ వాళ్లు నిర్వహించే కాల్ సెంటర్స్‌లో పనిచేసేవాడు. సైబర్ నేరాలకు అవసరమైన సిమ్ కార్డులు, బ్యాంక్ అకౌంట్స్‌ను సప్లయ్ చేసేవాడు. ఇందుకోసం యూపీలోని సప్లయర్స్‌తో పాటు దేశవ్యాప్తంగా సిమ్ కార్డులను సేకరించేవాడు. ఈ క్రమంలోనే జీవనోపాధికోసం దుబాయ్ వెళ్లిన జగద్గిరిగుట్టకు చెందిన షేక్ సుబానీ(26), జీడిమెట్ల చింతల్‌కు చెందిన నవీన్(22) హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌కు చెందిన ప్రేమ్‌కుమార్(24) కు పరిచయమయ్యాడు. ఇండియన్ సిమ్ కార్డులు, బ్యాంక్ అకౌంట్స్ సేకరిస్తే పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చని చెప్పాడు. దీంతో షేక్ సుబానీ, నవీన్, ప్రేమ్‌కుమార్‌లు సిమ్ కార్డులు, బ్యాంక్ అకౌంట్స్ సేకరించేందుకు ప్లాన్ చేశారు. ఇండియాకు వచ్చి సిమ్‌కార్డులు, బ్యాంక్ అకౌంట్స్‌ను సేకరించేవారు. వీటిని దుబాయ్‌లోని విజయ్‌కి కొరియర్ ద్వారా పంపేవారు.
టెలిగ్రామ్‌లో సిమ్ కార్డులు, బ్యాంక్ అకౌంట్స్
విజయ్ సూచనలతో సిమ్‌కార్డులు, బ్యాంక్ అకౌంట్స్‌ను విక్రయించేందుకు నిందితులు ముగ్గురు టెలిగ్రామ్ సోషల్ మీడియా గ్రూపులను ఏర్పాటు చేశారు. సిమ్ కార్డులు, బ్యాంక్ అకౌంట్స్ సేకరించేందుకు ఇండియాకు వస్తుండేవారు. రూ.500కు కొనుగోలు చేసేవారు. ‘‘ఇండియన్ సిమ్ కార్డ్స్ సేల్’’ ‘‘ఇండియన్ బ్యాంక్ అకౌంట్స్ సేల్’’ పేరుతో టెలిగ్రామ్‌లో ఒక్కో సిమ్ కార్డును రూ.1,500 నుంచి రూ.3000 వరకు అమ్మకానికి పెట్టేవారు. ప్రధానంగా దుబాయ్‌లోని చైనా దేశస్తులకు సప్లయ్ చేసేవారు. ఇలా కొనుగోలు చేసిన సిమ్‌కార్డులు, బ్యాంక్ అకౌంట్స్‌ను వారు థాయ్‌లాండ్, కాంబోడియాకు తరలించేవారు. వాటి ద్వారా సైబర్ నేరాలకు పాల్పడేవారు. దేశవ్యాప్తంగా నమోదైన కేసుల ఆధారంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో దర్యాప్తు చేసింది. బ్యాంక్ అకౌంట్స్ ఆధారంగా ముగ్గురు నిందితులను గుర్తించి అరెస్ట్ చేసింది.
