మల్హర్ వెలుగు: కారులో గంజాయి తరలిస్తున్న నలుగురి ముఠాను కొయ్యూరు పోలీసులు పట్టుకున్నారు. నిందితుల వద్ద 1.29 కిలోల గంజాయి( విలువ సుమారు రూ.65 వేలు), కారు, 3 మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. కొయ్యూరు ఎస్ఐ వి. నరేశ్తెలిపిన ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండల కేంద్రం పరిధి తాడిచెర్లలో కొయ్యూరు ఎస్ఐ –2 వి. రాజన్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. మారుతి స్విఫ్ట్ డిజైర్ కారు అటువైపు నుంచి వస్తుండగా ఆపి తనిఖీలు చేయగా గంజాయి దొరికింది.
కారులోని నలుగురిని అదుపులోకి తీసుకుని బిల్లా బన్ని, కోట లక్ష్మణ స్వామి, విజయగిరి హరీశ్, తొట్ల గణేశ్‌గా గుర్తించారు. వీరు ఒడిశాలోని మారుమూల గ్రామాలకు కారులో వెళ్లి గంజాయి తక్కువ ధరకు కొని తెచ్చి స్థానిక యువతకు అమ్ముతున్నట్టు తేలింది. గంజాయి పొట్లం రూ. 500కు సేల్ చేస్తున్నట్టు నిందితులు ఒప్పుకున్నారు. వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నరేశ్ చెప్పారు. గంజాయి ముఠాను పట్టుకున్న కొయ్యూరు పోలీసులను కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, సీఐ నాగార్జునరావు అభినందించారు.
మంచిర్యాల జిల్లాలో పట్టుబడిన ఇద్దరు
జైపూర్ (భీమారం) : మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలోని ఐటీడీఏ కాలనీలో గంజాయి అమ్ముతూ ఇద్దరు పట్టుబడినట్టు ఎస్ ఐ శ్వేత తెలిపారు. తాళ్లగూడెం కు చెందిన దుర్గం సంపత్ (25), నర్సింగాపూర్ గ్రామానికి చెందిన గోదారి దిలీప్(19) గంజాయి తాగడంతో పాటు అమ్ముతున్నారు. ఐటీడీఏ కాలనీలో గంజాయి అమ్ముతున్నారనే సమాచారం తో పోలీసులు అక్కడికి వెళ్లగా.. చూసి పారిపోతుండగా పట్టుకున్నారు. ఇద్దరి వద్ద 15 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు.
