బర్న బే (కెనడా): కెనడాలో జరిగిన గ్యాంంగ్ వార్ లో ఓ ఎన్నారై హత్యకు గురయ్యాడు. బ్రిటిష్ కొలంబియా రాష్ట్రం బర్నబీ నగరంలో జరిగిన కాల్పుల్లో భారత సంతతికి చెందిన దిల్‌రాజ్ సింగ్ గిల్(28) ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని వాంకోవర్ నివాసిగా గుర్తించారు. జనవరి 22న ‘కెనడా వే’ సమీపంలోని బ్లాక్‌లో కాల్పులు జరిగినట్లు బర్నబే ఆర్‌సీఎంపీ అధికారులకు సమాచారం అందింది.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రక్తం మడుగులో పడి ఉన్న దిల్‌రాజ్ సింగ్‌ను గమనించారు. అతడిని కాపాడేందుకు వైద్య సిబ్బంది ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. తీవ్ర గాయాల కారణంగా అతను అక్కడికక్కడే మృతిచెందాడు. కాల్పులు జరిగిన కొద్దిసేపటికే, సంఘటనా స్థలానికి సమీపంలోని బక్స్‌టోన్ స్ట్రీట్ (5000 బ్లాక్) లో ఒక కారు దహనమైంది.
దర్యాప్తు చేపట్టిన ఇంటిగ్రేటెడ్ హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (ఐహెచ్‌ఐటీ), ఈ కారుకు, దిల్‌రాజ్ సింగ్ హత్యకు సంబంధం ఉన్నట్లు నిర్ధారించింది. నిందితులు హత్య తర్వాత సాక్ష్యాలను తుడిచిపెట్టేందుకే కారును దహనం చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, మృతుడు దిల్‌రాజ్ సింగ్‌కు నేర చరిత్ర ఉందని, అతడు పోలీసు రికార్డుల్లో ఉన్నాడని తెలిపారు.
