ఖైరతాబాద్ లో ఘనంగా గంగ తెప్పోత్సవం

ఖైరతాబాద్ లో  ఘనంగా గంగ తెప్పోత్సవం

బషీర్ బాగ్ వెలుగు: ప్రతి ఏటా శ్రావణ మాసంలో గంగపుత్రులు భక్తి శ్రద్ధలతో నిర్వహించే గంగ తెప్పోత్సవం వేడుక ఘనంగా కొనసాగింది. ఆదివారం తెలంగాణ గంగ తెప్పోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఊరేగింపును ఖైరతాబాద్‌‌ చౌరస్తాలోని ఏడుగుడుల వద్ద రాష్ట్ర ఫిషరిస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, గంగ తెప్పోత్సవ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మహేందర్‌‌ బాబుతో కలిసి ప్రారంభించారు. గంగా తెప్ప, జలపందిరితో గంగపుత్ర మహిళలు బోనాలతో వేలాదిగా పాల్గొన్నారు. 

తెలంగాణ కళారూపాల నడుమ నృత్యాలు చేస్తూ , పోతరాజుల విన్యాసాలతో ముందుకు సాగారు. ఖైరతాబాద్ రైల్వే గేట్‌‌, బడా గణేశ్‌‌, ఐమ్యాక్స్‌‌ థియేటర్‌‌ మీదుగా సాగర్‌‌ ఒడ్డున ఉన్న గంగమ్మ ఆలయం వరకు శోభాయాత్ర కొనసాగింది. మంత్రి పొన్నం ప్రభాకర్ , ఎమ్మెల్యే దానం నాగేందర్‌‌, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గంగమ్మ తెప్పను ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మహేందర్‌‌ బాబు సాగర్‌‌లో నిమజ్జనం చేశారు. మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హన్మంత రావు, కార్పొరేటర్ విజయారెడ్డి పాల్గొన్నారు.