యూపీలో గ్యాంగ్​స్టర్​ అతీక్​ కాల్చివేత.. అతని సోదరుడు కూడా మృతి

యూపీలో గ్యాంగ్​స్టర్​ అతీక్​ కాల్చివేత.. అతని సోదరుడు కూడా మృతి

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్​లో గ్యాంగ్ స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్​ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. శనివారం రాత్రి పోలీసులు వారిని ప్రయాగ్​రాజ్​లోని ఆస్పత్రికి మెడి కల్  చెకప్​కు తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మీడియాతో అతీక్, అష్రఫ్​ మాట్లాడుతుండగా.. అకస్మాత్తుగా ముగ్గురు వ్యక్తులు వారిపై అతి సమీపం నుంచి (పాయింట్  బ్లాంక్  రేంజ్) కాల్పులు జరిపారు. దీంతో వారిద్దరూ స్పాట్​లోనే చనిపోయారు. చుట్టూ పోలీసులు కాపలా ఉన్నా వారు కాల్పులు జరిపారు.

ఈ ఘటనకు సంబంధించి ముగ్గురి నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఈ హత్యలపై వారు ఇంకా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. అతీక్  అహ్మద్  గతంలో సమాజ్ వాదీ పార్టీ నుంచి ఎంపీగా ఎన్నికయ్యాడు. అంతకుముందు ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. 2005లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్  మర్డర్  కేసులో అతీక్​ నిందితుడిగా ఉన్నాడు. అంతేకాకుండా ఈ ఏడాది ఫిబ్రవరిలో రాజు పాల్ అడ్వొకేట్ అయిన ఉమేశ్  పాల్ కూడా హత్యకు గురయ్యాడు.

 ఈ హత్యలోనూ అతీక్  హస్తం ఉందని ఆరోపణలు ఉన్నాయి. అతనిపై మొత్తం వందకుపైగా క్రిమినల్  కేసులు ఉన్నాయి. కొన్ని కేసుల్లో దోషిగా తేలాడు. కాగా, అతీక్  కొడుకు అసద్  ఈ నెల 13న ఝాన్సీలో ఎన్ కౌంటర్​లో హతమయ్యాడు.