పనీర్​ మీద గంగుబాయి బొమ్మ

పనీర్​ మీద గంగుబాయి బొమ్మ

పనీర్ కనిపిస్తే పాలక్​ పనీర్​, పనీర్​ బటర్​ మసాలా కర్రీ చేస్తారు ఎవరైనా. కానీ, ఇతను మాత్రం పనీర్​మీద సెలబ్రిటీల బొమ్మలు వేస్తాడు. మధ్యప్రదేశ్​లోని ఆస్తాకు చెందిన ఈ ఆర్టిస్ట్​ పేరు ప్రఫుల్ జైన్. ఈమధ్యే రిలీజ్​ అయిన ‘గంగూబాయి కథియవాడి’ సినిమాలో ఆలియాభట్ ​ఫొటోని పనీర్​ మీద ఆర్ట్​గా వేశాడు. ఆ  ఫొటో ఇప్పుడు ఇంటర్నెట్​లో వైరల్​ అవుతోంది. ​ముందుగా పనీర్ మీద (పేపర్లు కత్తిరించేందుకు ఉపయోగించే) కత్తితో గంగూబాయిలా ఉన్న ఆలియాభట్​ బొమ్మ గీశాడు. ఆ బొమ్మ కనిపించడం కోసం పనీర్​ మీద సోయా సాస్​ పోశాడు. పనీర్​ మీద ఆలియాభట్​ బొమ్మ గీస్తున్న ​ వీడియోని ఇన్​స్టాగ్రామ్​లో పెట్టాడు ప్రఫుల్​. ఆ వీడియో చూసినవాళ్లంతా అతని క్రియేటివిటీని ఒకటే మెచ్చుకుంటున్నారు. ఇప్పటికే ఈ వైరల్ వీడియోను 70 వేల మందికిపైగా లైక్​ చేశారు. ప్రఫుల్​ పనీర్​ పెయింటింగ్​ వేయడం ఇది మొదటిసారి కాదు. ఇంతకుముందు ‘సర్దార్​ ఉద్ధమ్​ సింగ్​’ సినిమాలో విక్కీ కౌశల్​ ఫొటోని కూడా పనీర్​ మీద వేశాడు. 

కొత్తగా చేయాలని...
‘‘నాకు పనీర్​ అంటే చాలా ఇష్టం.  ఒకరోజు  పనీర్​ తినేటప్పుడు అది రెండు ముక్కలైంది. వాటిని గమనించిన తర్వాత పనీర్​ మీద ఆర్ట్​ వేయొచ్చని  అనిపించింది. కానీ, పనీర్ మీద ఆర్ట్​ వేయడం ఈజీ కాదు​. పనీర్​ మీద ఆర్ట్​వేసి, బొమ్మ కనిపించేందుకు సోయా సాస్​ పోయడం అనేది కాఫీ స్టెయిన్​ టెక్నిక్​ లాంటిదే. ఇంట్లో వండడానికి పనీర్​ రెడీగా ఉన్నప్పుడు ఇలాంటి ఆర్ట్స్​ వేస్తుంటాను. ఆర్ట్​ వేసిన తర్వాత పనీర్​ని పడేయకుండా... దాంతో పనీర్​ పకోడీ చేశాను” అంటున్నాడు ఈ ఫుడ్ ఆర్టిస్ట్.