ఒకప్పటి డ్రైవర్లు, క్లీనర్లు..ఇప్పుడు ఓనర్లయిన్రు

ఒకప్పటి డ్రైవర్లు, క్లీనర్లు..ఇప్పుడు ఓనర్లయిన్రు

కరీంనగర్​ సిటీ, వెలుగు: దళితుల ఇండ్లలో వెలుగులు నింపేందుకే సీఎం కేసీఆర్​ దళితబంధు పథకం తీసుకొచ్చారని బీసీ సంక్షేమ, సివిల్​ సప్లైస్​ శాఖ మంత్రి గంగుల కమలాకర్​ అన్నారు. శుక్రవారం కరీంనగర్​లోని అంబేద్కర్​ స్టేడియంలో లబ్ధిదారులకు దళితబంధు యూనిట్లను ఆయన పంపిణీ చేశారు. 24 మంది లబ్ధిదారులకు 10 యూనిట్లను అందజేశారు. 6 హార్వెస్టర్లు, 3 జేసీబీలు, ఒక డీసీఎం వ్యాన్​ను ఇచ్చారు. ముగ్గురు లేదా నలుగురు కలిసి ఓ బృందంగా ఏర్పడి వాటిని ఎంపిక చేసుకున్నారని ఆయన చెప్పారు. ఒక్కో హార్వెస్టర్​ రూ.22 లక్షలు, ఒక్కో జేసీబీ రూ.34 లక్షలు, డీసీఎం వ్యాన్​ రూ.24 లక్షలని తెలిపారు. ఒకప్పుడు డ్రైవర్లు, క్లీనర్లుగా పనిచేసినోళ్లంతా ఇప్పుడు దళితబంధు ద్వారా యజమానులయ్యారని ఆయన అన్నారు. అనంతరం అదే ఆడిటోరియంలో నేతలు, అధికారులతో దళితబంధు పథకం అమలుపై ఆయన సమీక్ష చేశారు. ఇప్పటిదాకా ఏ ప్రధానీ, ఏ సీఎం చేపట్టని సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్​ అమలు చేస్తున్నారని అన్నారు. 

డెయిరీ యూనిట్లకే ప్రాధాన్యం

హుజూరాబాద్​ నియోజకవర్గంలో అర్హులైన 17,556 కుటుంబాల ఖాతాల్లో దళిత బంధు నగదు జమ చేశామని గంగుల కమలాకర్​ చెప్పారు. 1,500కు పైగా కుటుంబాలు డెయిరీ యూనిట్లను ఎంపిక చేసుకోగా వారికి శిక్షణ ఇప్పించి యూనిట్లను మంజూరు చేయించామని తెలిపారు. డెయిరీ షెడ్ల నిర్మాణం కోసం రూ.లక్షన్నర అందించామన్నారు. 6,800 మంది ట్రాన్స్​పోర్ట్​ వాహనాల కోసం ధరఖాస్తు చేసుకోగా అందులో అర్హులైన వారికి లైసెన్సులు ఇప్పించామని తెలిపారు. లాభసాటిగా ఉండే డెయిరీ యూనిట్లకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని, మిగతా యూనిట్లకు సంబంధించి లబ్ధిదారులకు అవగాహన కల్పించాక యూనిట్లను గ్రౌండింగ్​ చేస్తున్నామని మంత్రి తెలిపారు. కరీంనగర్​ జిల్లాలోని కరీంనగర్​, మానకొండూర్​, చొప్పదండి నియోజకవర్గాల్లో మొదటి దశలో మార్చి 31లోగా వంద యూనిట్ల చొప్పున దళిత బంధు పథకం అమలు చేస్తామని తెలిపారు. వచ్చే నెల 15 లోగా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, అధికారుల సాయంతో లబ్ధిదారులను ఎంపిక చేయాలని, మార్చి ఒకటి నాటికి జాబితా సిద్ధం చేయాలని ఆయన సూచించారు. రిపబ్లిక్​ డే నాటికి జిల్లాలో వ్యాక్సినేషన్​ను వంద శాతం పూర్తి చేసిన గ్రామాలకు రూ.లక్ష ప్రైజ్​ మనీ ఇస్తామని ప్రకటించారు. రెండో బహుమతిగా రూ.50 వేలు, మూడో ప్రైజ్​గా రూ.25 వేలు ఇస్తామన్నారు.