కాళేశ్వరంతో గ్రౌండ్‌ వాటర్‌ పెరిగినయ్ అందుకే వరదలు

కాళేశ్వరంతో గ్రౌండ్‌ వాటర్‌ పెరిగినయ్ అందుకే వరదలు

కరీంనగర్, వెలుగు:  ‘‘గతంలో గ్రౌండ్ వాటర్ ఎక్కువగా లేకపోతుండే. అందువల్ల వర్షాలు పడినపుడు ఆ నీళ్లన్ని భూమిలోకి ఇంకేది. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినంక రాష్ట్రంలో గ్రౌండ్ వాటర్ లెవల్స్ పెరిగాయి. గ్రౌండ్ వాటర్​ ఎక్కువ ఉండడంతో చిన్న వర్షం పడినా వరదలు వస్తున్నాయి’ అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తెరపిలేకుండా కురుస్తున్న వర్షాల వల్ల కరీంనగర్ సిటీలో లోతట్టు  ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో మంత్రి గంగుల కమలాకర్, సిటీ మేయర్ సునీల్ రావు మంగళవారం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ.. నిరుటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అన్ని జలాశయాలు, చెరువులు నింపుకుంటున్నామని దీంతో రాష్ట్రవ్యాప్తంగా గ్రౌండ్​వాటర్​ పెరిగిందన్నారు. అందుకే వర్షపు నీరు భూమిలో ఇంకడం లేదని, ఫలితంగా చిన్న వర్షానికే వరదలు వస్తున్నాయన్నారు. సిటీలో వరదని ఎస్సారెస్పీ కెనాల్​లోకి మళ్లించామన్నారు. ఎటువంటి ప్రాణనష్టం లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు.