గంజాయి కేసులో అరెస్ట్‌‌.. వీడిన రెండేళ్ల కింది మర్డర్‌‌ మిస్టరీ

గంజాయి కేసులో అరెస్ట్‌‌.. వీడిన రెండేళ్ల కింది మర్డర్‌‌ మిస్టరీ
  •     సుపారి ఇచ్చి భర్తను చంపించిన భార్య

మల్యాల, వెలుగు : గంజాయి తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా.. రెండేండ్ల కింద కొండగట్టు శివారులో జరిగిన ఓ మర్డర్‌‌ మిస్టరీ వీడింది. భార్యే సుపారీ ఇచ్చి భర్తను చంపించినట్లు పోలీసులు గుర్తించారు. కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ రఘుచందర్, సీఐ నీలం రవి గురువారం మల్యాల పోలీస్‌‌స్టేషన్‌‌లో వెల్లడించారు. మెట్‌‌పల్లికి చెందిన గ్రాహిత్‌‌, చిన్న నిఖిల్‌‌ వారం కింద గంజాయి తరలిస్తుండగా మెట్‌‌పల్లి పోలీసులు పట్టుకున్నారు. 

వారిని విచారించే క్రమంలో, వారి సెల్‌‌ఫోన్‌‌లోని ఓ వీడియో ఆధారంగా 2023లో జరిగిన ఓ వ్యక్తి హత్య విషయం బయటపడింది. హత్య చేసిన అనంతరం డెడ్‌‌బాడీని కొండగట్టు వద్ద కాల్చేసినట్లు తేలడంతో వెంటనే మల్యాల పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా.. మర్డర్‌‌కు సంబంధించిన విషయాలన్నీ బయటపడ్డాయి. 2023 మార్చి 12న కొండగట్టులోని టేకు తోట సమీపంలో కాలిన డెడ్‌‌బాడీ కనిపించడంతో వీఆర్‌‌ఏ ఫిర్యాదుతో అప్పటి పోలీసులు కేసు నమోదు చేశారు. 

వివరాలు తెలియకపోవడంతో హత్య విషయం మిస్టరీగానే మిగిలింది. ఇప్పుడు గంజాయి కేసులో పట్టుబడిన వారు చెప్పిన వివరాల ప్రకారం... హత్యకు గురైన వ్యక్తి మెట్‌‌పల్లిలోని సాయిరాం కాలనీకి చెందిన సింగం నడిపిగంగాధర్‌‌ (45)గా గుర్తించారు. మద్యానికి బానిసైన గంగాధర్‌‌ తరచూ భార్యతో పాటు కుటుంబ సభ్యులను హింసించేవాడు. ఈ విషయాన్ని గంగాధర్‌‌ భార్య సంధ్య తన తోడికోడలు వరసైన మమత, ఆమె కొడుకు గ్రాహిత్‌‌కు చెప్పింది.

 దీంతో గ్రాహిత్‌‌ గంగాధర్‌‌పై దాడి చేశాడు. అయినా అతడిలో మార్పు రాకపోవడంతో హత్య చేయాలని సంధ్య నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా గ్రాహిత్‌‌కు రూ. 40 వేలు ఇవ్వడంతో అతడు తన ఫ్రెండ్స్‌‌ అయిన అఫ్సర్‌‌, నిఖిల్‌‌, పవన్‌‌కు విషయం చెప్పాడు. నలుగురు కలిసి ఓ కారును అద్దెకు తీసుకొని గంగాధర్‌‌ను ఎక్కించుకొని కొండగట్టు టేకుతోట వద్దకు తీసుకెళ్లారు. అక్కడ మద్యం తాగిన అనంతరం గంగాధర్‌‌ను గొంతునులిమి చంపి, అక్కడే తగులబెట్టారు. 

ఈ కేసులో గ్రాహిత్‌‌, అఫ్సర్‌‌, నిఖిల్‌‌ను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. పవన్‌‌ ప్రస్తుతం చంచల్‌‌గూడ జైలుల్లోఉన్నాడు. గంగాధర్‌‌ భార్య సంధ్య పోలీసుల ఎదుట లొంగిపోయింది. మరో నిందితురాలైన గ్రాహిత్‌‌ తల్లి మమత గతంలోనే చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. సమావేశంలో ఎస్సై నరేశ్‌‌కుమార్‌‌ పాల్గొన్నారు.