గల్లీ గల్లీలో గంజాయి .. స్కూళ్లు, కాలేజీలే లక్ష్యంగా అమ్మకాలు

గల్లీ గల్లీలో గంజాయి .. స్కూళ్లు, కాలేజీలే లక్ష్యంగా అమ్మకాలు
  • మత్తుకు బానిసలవుతున్న స్టూడెంట్లు.. మత్తులో రేప్​లు, మర్డర్లు 
  • మైనర్లతో గంజాయి సప్లై చేయిస్తున్న ముఠాలు 
  • చాక్లెట్లు, హ్యాష్​ ఆయిల్​ రూపంలో విక్రయాలు
  • రాష్ట్రంలో గత పదేండ్లలో మూడు రెట్లు పెరిగిన గంజాయి సప్లై  

వెలుగు, నెట్​వర్క్/హైదరాబాద్: రాష్ట్రంలో గంజాయి గుప్పుమంటున్నది. పల్లె, పట్నం అనే తేడా లేకుండా పాన్​డబ్బాలు మొదలుకొని కిరాణా షాపుల దాకా ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ గంజాయి దొరుకుతున్నది. పాత నేరస్తులను పోలీసులు టార్గెట్​ చేస్తుండడంతో.. స్టూడెంట్లను గంజాయి స్మగ్లర్స్ లక్ష్యంగా చేసుకుంటున్నారు. చాక్లెట్లు, హ్యాష్​ఆయిల్​రూపంలో మార్చిన గంజాయిని ముందుగా హైస్కూల్, కాలేజీ పిల్లలకు అలవాటు చేసి.. వారి ద్వారా ఇతరులకు అమ్మిస్తున్నారు. దీంతో ఈ చైన్​లింక్​ను తెంపడం పోలీసులకు కష్టంగా మారింది. 

చాక్లెట్లు, హ్యాష్​ ఆయిల్​గా మార్చి..  

గత పదేండ్లుగా రాష్ట్రంలో గంజాయి రవాణా ​మూడు రెట్లు పెరిగినట్టు పోలీస్​గణాంకాలు చెప్తున్నాయి. గంజాయికి బానిసలయ్యే వాళ్ల సంఖ్య పెరిగినకొద్దీ డిమాండ్, సప్లై కూడా అదే స్థాయిలో పెరుగుతున్నది. పోయినేడాది రాష్ట్ర వ్యాప్తంగా 1,360 నార్కోటిక్స్‌‌ కేసులు నమోదు కాగా.. ఇందులో 1,273 కేసులు గంజాయి కేసులే. మొత్తం మీద 25,260 కిలోల గంజాయి,1,240 గంజాయి ప్లాంట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఏకంగా 2,583 మంది సప్లయర్లను అరెస్ట్‌‌ చేశారు. ఇంత పెద్ద సంఖ్యలో స్మగ్లర్లు, సప్లయర్లను అరెస్ట్​ చేసినప్పటికీ గంజాయి రవాణా మాత్రం ఆగడం లేదు. విశాఖ ఏజెన్సీ, ఒడిశా నుంచి రాష్ట్రంలోకి గంజాయి సప్లై అవుతుండగా.. దాడుల్లో ముడి గంజాయి ఎక్కువగా పట్టుబడుతుండడంతో స్మగ్లర్లు ఎప్పటికప్పుడు కొత్తదారులు వెతుకుతున్నారు. 

గంజాయిని చాక్లెట్లు, హాష్​ఆయిల్​రూపంలోకి మార్చి ట్రాన్స్​పోర్ట్​చేస్తుండడంతో పట్టుకోవడం పోలీసులకు సవాల్​గా మారుతున్నది.

మైనర్లతో సప్లై..

గంజాయి స్మగ్లింగ్​చేస్తూ పట్టుబడ్తున్నోళ్ల వివరాలు ముఖ్యంగా ఫొటోలు, వేలిముద్రలు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్‌‌ బ్యూరో(టీఎస్‌‌ న్యాబ్‌‌), ఎస్​వోటీ(స్పెషల్​ఆపరేషన్​టీమ్)  పోలీసుల రికార్డుల్లోకి ఎక్కుతున్నాయి. ఇలా పాత నేరస్తుల కదలికలపై నిఘా పెరగడంతో స్మగ్లర్లు రూట్​మార్చేశారు. కొన్నేండ్లుగా మైనర్ల ద్వారా గంజాయి దందా రన్​చేస్తున్నారు. మైనర్లను స్కూళ్లు, కాలేజీల వద్ద మోహరించి ముందుగా సిగరెట్లు తాగేవారిని టార్గెట్ చేస్తున్నారు.

వారికి గంజాయి సిగరెట్లను, చాక్లెట్లను, హాష్ ఆయిల్‌‌ ను  కొద్ది రోజుల పాటు ఉచితంగా అందిస్తున్నారు. వాళ్ల ద్వారా ఇతరులకు అలవాటు చేసి గంజాయి చైన్ క్రియేట్ చేస్తున్నారు. స్టూడెంట్లు బానిసలుగా మారాక అడ్డగోలు రేట్లకు అమ్ముతున్నారు. మత్తుకు బానిసైనవాళ్లు అందులోంచి బయటపడలేక ముఠాలకు సహకరిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులకు మైనర్లు పట్టుబడితే నిబంధనల ప్రకారం కౌన్సెలింగ్​ఇచ్చి పంపుతున్నారు.

దీన్ని అలుసుగా తీసుకున్న స్మగర్లు రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది మైనర్లతో గంజాయి గ్యాంగ్స్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్​సిటీలోనైతే 13 నుంచి 17 ఏండ్ల వయసున్న మైనర్ల​గ్యాంగ్స్ 50 గ్రాముల నుంచి 100 గ్రాముల గంజాయి పొట్లాలను తయారు చేసి  బస్సులు,ఆటోల్లో తరలిస్తున్నట్టు టీఎస్ న్యాబ్‌‌ అధికారులు గుర్తించారు. గంజాయికి అలవాటు పడినవారే సప్లయర్స్​గా మారుతుండడంతో ఈ సప్లై చైన్​ను బ్రేక్​చేయడం పోలీసులకు కష్టమవుతున్నది. 

మత్తులో దారుణాలు 

గంజాయికి బానిసైనోళ్లు మత్తులో దారుణాలకు పాల్పడుతున్నారు. మర్డర్లు, రేప్​లు చేస్తున్నారు. జగిత్యాలలోని ఓ హైస్కూల్​లో చదివే బాలిక తోటి స్టూడెంట్ల ద్వారా గంజాయికి అలవాటు పడింది. ఈ క్రమంలో గంజాయి ఆశచూపి ఆమెపై ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక ప్రవర్తనలో మార్పు గమనించిన తండ్రి అనుమానంతో ఆరా తీయగా విషయం బయటకు వచ్చింది. అప్పటికే ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ముందుగా డీఅడిక్షన్ సెంటర్ కి, అక్కడి నుంచి కరీంనగర్​లోని సేఫ్ హోమ్​కు తరలించి ట్రీట్​మెంట్​చేయిస్తున్నారు.

ఇటీవల వెలుగుచూసిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ నెల 25న ఎటపాక మండలం వెంకటరెడ్డిపేటలో భద్రాచలానికి చెందిన యువకులు గంజాయి మత్తులో ఏపీకి చెందిన ముగ్గురిని కత్తితో పొడవగా ఆజ్మీరా సాయికుమార్​(15)అనే బాలుడు చనిపోయాడు. ఫిబ్రవరి 15న నిజామాబాద్​చంద్రశేఖర్​కాలనీలో సోనూ అనే వ్యక్తి జలీల్​ఖాన్​అనే వ్యక్తిని కొట్టి చంపాడు. ఫిబ్రవరి 16న నిజామాబాద్​పాత కలెక్టరేట్​ఏరియాలో అజయ్​అనే వ్యక్తి గౌస్​పాషా అనే యువకుడిని కత్తితో పొడిచాడు.  పోలీసులు ఆరా తీస్తే వీరిద్దరూ గంజాయి మత్తులోనే ఈ దారుణాలకు పాల్పడ్డారని తెలిసింది. ప్రతిరోజూ ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో ఏదో ఒక మూలన జరుగుతుండడం కలవరపెడుతున్నది. 

జాడ లేనియాంటీ డ్రగ్​కమిటీలు..

గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాల నిర్మూలన కోసం జాతీయ స్థాయిలోనే కాకుండా రాష్ట్ర, జిల్లా స్థాయిలో నార్కో కోఆర్డినేషన్ సెంటర్(ఎన్సీఓఆర్డీ) కమిటీలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం 2019లో నిర్ణయించింది. రాష్ట్ర స్థాయి కమిటీకి సీఎస్, జిల్లా స్థాయి కమిటీకి కలెక్టర్ చైర్మన్ గా వ్యవహరిస్తారు. రాష్ట్ర స్థాయిలో ప్రతి మూడు  నెలలకోసారి, జిల్లా స్థాయిలో ప్రతి నెలా కమిటీలు సమావేశం నిర్వహించి గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాల నివారణపై తీసుకుంటున్న చర్యలపై చర్చించాల్సి ఉంటుంది.

కానీ రాష్ట్ర స్థాయిలో తప్ప జిల్లాల్లో కమిటీలు ఏర్పాటు చేయలేదు. దీంతో పాటు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో యాంటీ ర్యాగింగ్ కమిటీల తరహాలో యాంటీ డ్రగ్ కమిటీ(ఏడీసీ)లను కూడా ఏర్పాటు చేయాలని గతంలోనే ఉన్నత విద్యాశాఖ అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలను ఆదేశించింది. కానీ ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా కేవలం 174 కాలేజీల్లో మాత్రమే ఏడీసీలను ఏర్పాటు చేశారు. ఇందులో జిల్లాకు ఒకట్రెండు చొప్పున 16 జిల్లాల్లో కలిపి 22 కమిటీలే ఏర్పాటు చేయడం గమనార్హం.

3 నెలల్లో 2,200 కిలోలు సీజ్ 

గత మూడు నెలల్లో 2,200 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 70 కిలోల గంజాయి చాక్లెట్లు పట్టుకున్నారు. 284 కేసులు నమోదు చేసి 400 మందిని అరెస్ట్ చేశారు. అలాగే 1.25 కిలోల హాష్​ఆయిల్, 3.27 కిలోల ఓపియం, 60.2 గ్రాముల చారాస్ స్వాధీనం చేసుకున్నారు. 101 వాహనాలు సీజ్ చేశారు. 

ఫ్రీగా ఇచ్చి.. అలవాటు చేసి.. 

శంషాబాద్ సమీపంలోని కొత్తూర్​ జడ్పీ హైస్కూల్​లో చదువుతున్న పిల్లల్లో రెండు నెలల కింద వింత మార్పులు కనిపించాయి. ప్రేయర్ చేస్తుండగా కళ్లు తిరిగిపడిపోవడం, క్లాస్​ జరుగుతుండగా నిద్రపోవడం, గేట్​ వద్దే ఒంటికి, రెంటికి పోతుండడంతో హెచ్​ఎంకు అనుమానం వచ్చి ఆరా తీశారు. పక్కనే ఉన్న కిరాణాషాపులో చాక్లెట్లు తిన్నప్పటి నుంచి ఇలా జరుగుతున్నదని తెలుసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన శంషాబాద్‌‌ ఎస్‌‌ఓటీ పోలీసులు ఎంక్వైరీ చేస్తే ఒడిశాకు చెందిన ధీరేంద్ర బెహ్రా ‘చార్మినార్ గోల్డ్’​ పేరుతో గంజాయి చాక్లెట్లు తెప్పించి విద్యార్థులకు అమ్ముతున్నట్టు తెలిసి షాక్​కు గురయ్యారు. మొదట్లో స్కూల్​ పిల్లలకు ఫ్రీగా చాక్లెట్లు ఇచ్చిన ధీరేంద్ర.. వాళ్లు అలవాటు పడ్డాక ఒక్కో చాక్లెట్​ను రూ.30 నుంచి రూ.50 చొప్పున అమ్మడం మొదలుపెట్టాడు. 

విషయం బయటపడ్తదని దాడి..

నిజామాబాద్​జిల్లా మాక్లూర్ మండలంలోని గవర్నమెంట్ హైస్కూల్​లో నలుగురు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ గంజాయికి అలవాటు పడ్డారు. ఆ సంగతి మరో టెన్త్ స్టూడెంట్​కు తెలియడంతో ఎక్కడ టీచర్లకు చెప్తాడోనని భయపడి అతనికి సైతం గంజాయి తాగించాలని ప్రయత్నించారు. అయితే ఆ బాలుడు ఒప్పుకోకపోవడంతో నలుగురు కలిసి దారుణంగా కొట్టడంతో ఆపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దీంతో బాధిత స్టూడెంట్​ను నిజామాబాద్​లోని ఓ ప్రైవేట్​హాస్పిట్​లో  చేర్పించగా, వారం రోజుల తర్వాత కోలుకున్నాడు.