గంజాయి ముఠాలో 12 మంది అరెస్ట్ ..పరారీలో మరో ముగ్గురు ప్రధాన నిందితులు

గంజాయి ముఠాలో 12 మంది అరెస్ట్ ..పరారీలో మరో ముగ్గురు ప్రధాన నిందితులు
  • 7.4 కిలోల గంజాయి, కారు, 
  • 3 బైక్ లు, 10 సెల్ ఫోర్లు స్వాధీనం  

మిర్యాలగూడ, వెలుగు: గంజాయి రవాణా చేసే ముఠా నల్గొండ జిల్లా పోలీసులకు పట్టుబడింది. 12 మంది నిందితులను అరెస్ట్ చేసి.. 7.4 కిలోల గంజాయితో పాటు ఒక కారు, 3 బైక్ లు, 10 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మిర్యాలగూడ టూ టౌన్ పీఎస్ లో మీడియా సమావేశంలో శుక్రవారం డీఎస్పీ రాజశేఖర్ రాజు వివరాలు వెల్లడించారు.  

ఏపీలోని పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పలపహాడ్ కు చెందిన భూక్యా హనుమాన్ నాయక్, సింగాల కాటంరాజు, నరసరావుపేట జిల్లా కారంపూడికి చెందిన మద్దూరు చంటి ముఠాగా ఏర్పడ్డారు. గంజాయితోపాటు డ్రగ్స్ ను అక్రమంగా రవాణా చేస్తున్నారు. గంజాయిని ఒడిశాకు చెందిన ఆనంద్ గురు అనే వ్యక్తి వద్ద తక్కువ ధరకు కొని తెచ్చి.. మిర్యాలగూడ టౌన్ లో యువకులకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. 

గురువారం టౌన్ లో రెండు ముఠాలు గంజాయి అమ్ముతున్నట్టు సమాచారం అందడంతో  టూ టౌన్ సీఐ సోమ నరసయ్య సిబ్బందితో వెళ్లి దాడి చేశారు.  మద్దూరు చంటి తో పాటు మిర్యాలగూడ టౌన్ కు చెందిన మహ్మద్ అర్షద్ అయూబ్, మహ్మద్ సలీం, మహ్మద్ జునైద్ అలీ, షేక్ అఫ్రోజ్, గూడూరుకు చెందిన షేక్ రియాజ్, కేశవపురానికి చెందిన కుర్ర సందీప్, మిర్యాలగూడ టౌన్ కు చెందిన  సోహెల్, నజీరుద్దీన్ బాబా, షేక్ సమీర్, ఖానాపురం శరత్, ఎండీ సమీర్ ముఠాను అరెస్టు చేశారు. ప్రధాన నిందితులు హనుమాన్ నాయక్, కాటం రాజు, ఆనంద్ గురు పరారీలో ఉన్నట్టు డీఎస్పీ తెలిపారు.