కంటైనర్ లో జైపూర్ కు గంజాయి ట్రాన్స్ పోర్ట్ అంతర్రాష్ట్ర నిందితులు అరెస్ట్ ...599 కేజీల గంజాయి స్వాధీనం

కంటైనర్ లో జైపూర్ కు గంజాయి ట్రాన్స్ పోర్ట్ అంతర్రాష్ట్ర నిందితులు అరెస్ట్ ...599 కేజీల గంజాయి స్వాధీనం

 

  • భద్రాద్రి ఎస్పీ రోహిత్ రాజ్ వెల్లడి

సుజాతనగర్, వెలుగు: కంటైనర్ లో గంజాయిని తరలిస్తుండగా.. భద్రాద్రి జిల్లా సుజాతనగర్ పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్ట్ చేసి రూ. 2.50 కోట్ల విలువైన సరుకు స్వాధీనం చేసుకున్నారు. 

మీడియా సమావేశంలో ఎస్పీ రోహిత్ రాజ్ వివరాలు వెల్లడించారు. సోమవారం ఉదయం ధన్వంతరి కాలేజీ వద్ద సుజాతనగర్, సీసీ‌ఎస్ పోలీసులు వాహన తనిఖీలు చేస్తున్నారు. అనుమానాస్పదంగా వచ్చిన కంటైనర్(కేఏ38 ఏ6754 )ని ఆపి చెక్ చేయగా.. 96 పార్సిళ్లలో 499 కేజీల గంజాయి లభ్యమైంది.

 కర్నాటకలోని బీదర్ కు చెందిన డ్రైవరు కమ్ ఓనర్ సంజు కుమార్, మహారాష్ట్రలోని జల్గావ్ కు చెందిన జగదీశ్​దయారాం పాటిల్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. ఏపీలోని నెల్లిపాకలో గంజాయి కొనుగోలు చేసి కొత్తగూడెం, ఖమ్మం మీదుగా రాజస్థాన్ లోని జైపూర్ కు తరలిస్తున్నట్లు చెప్పారు.  మరో ఇద్దరు అమిత్ రోహిదాస్ పాటిల్, హరి పరారీలో ఉన్నారు. 

ఈ ఏడాది జిల్లాలో ఇప్పటివరకు 59 కేసుల్లో రూ. 25.89 కోట్ల విలువైన 5,200 కేజీల గంజాయి పట్టుకున్నట్టు, 185 మందిని అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. గంజాయి పట్టుకున్న సుజాతనగర్, సీసీ‌ఎస్ పోలీసులను అభినందించారు. డీఎస్పీ అబ్దుల్ రెహమాన్, సీఐలు రాయల వెంకటేశ్వర్లు, రమాకాంత్, ఎస్ఐ రమాదేవి, ప్రవీణ్, రామారావు సిబ్బంది ఉన్నారు.