
- భద్రాద్రి జిల్లా పోలీసుల అదుపులో నిందితులు
పినపాక, వెలుగు: ఒడిశా నుంచి హైదరాబాద్ కు కార్లలో గంజాయిని తరలిస్తుండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏడూళ్ల బయ్యారం పోలీసులు పట్టుకున్నారు. ఐదుగురిని అదుపులోకి తీసుకుని 50 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోగా.. దీని విలువ రూ. 25 లక్షలు ఉంటుంది. సీఐ వెంకటేశ్వరరావు తెలిపిన ప్రకారం.. ఒడిశా నుంచి హైదరాబాద్ కు ఐదుగురు 3 కార్లలో గంజాయిని తరలిస్తూ బైక్ పై ఎస్కార్ట్ గా వెళ్తున్నారు.
గురువారం సాయంత్రం పినపాక మండలం పెంటన్నపాడు క్రాస్ రోడ్ వద్ద తనిఖీలు చేస్తుండగా కార్ల డిక్కీలో50 కేజీల గంజాయి లభించింది. కరీంనగర్ కు చెందిన పల్లెపు ప్రశాంత్, చండ్రుగొండకు చెందిన దాసరి వెంకటేశ్వర రావు, తంబళ్ల పుల్లారావు, చత్తీస్ గఢ్ లోని కుంట గ్రామానికి చెందిన మడకం రాజు, చింతకాని మండలానికి చెందిన కొండూరి వినయ్ ను అదుపులోకి తీసుకున్నారు. కార్లను, ఎస్కార్ట్ బైక్, 8 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం నిందితులను రిమాండ్ కు తరలించామని సీఐ తెలిపారు.