స్వచ్ఛ ఆటో రావట్లే.. ఇండ్లల్లో పేరుకుపోతున్న చెత్త

స్వచ్ఛ ఆటో రావట్లే.. ఇండ్లల్లో పేరుకుపోతున్న చెత్త
  • బల్దియా అధికారుల నిర్లక్ష్యంతో ఇండ్లల్లో పేరుకుపోతున్న చెత్త

హైదరాబాద్, వెలుగు: బల్దియా నిర్లక్ష్యం కారణంగా ఇండ్లలో చెత్త పేరుకుపోతోంది. ఇంటింటికి వెళ్లి సేకరించే స్వచ్ఛ ఆటోలు వారానికోసారి వస్తున్నాయి. ప్రస్తుతం ఓనర్​ కమ్​ డ్రైవర్​ స్కీమ్​ కింద 2,850 స్వచ్ఛ ఆటోలు నడుస్తున్నాయి. గ్రేటర్​లో దాదాపు 30 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఒక్కో స్వచ్ఛ ఆటో వెయ్యికిపైగా ఇండ్ల నుంచి చెత్తను సేకరించాల్సి ఉంది. రోజుకు 300 ఇండ్లకు మించి చెత్త తీసుకెళ్లడం కష్టంగా మారింది. దీంతో కొన్ని ఏరియాల్లో రెండు, మూడు రోజులకు ఒకసారి కూడా చెత్తను తీసుకెళ్లడం లేదు. ఆటోలు తక్కువగా ఉండడంతో కొన్ని ప్రాంతాలకు అసలు రావడం లేదు. దీంతో రాత్రిపూట రోడ్లపై ఎక్కడపడితే అక్కడ జనం చెత్తను పారబోస్తున్నారు.  చెత్త తీసుకెళ్లేవారికి ఒక్కో ఇంటికి నెలకి ఎంత చెల్లించాలన్న దానిపైన బల్దియా క్లారిటీ ఇవ్వడంలేదు. దీంతో జనం స్వచ్ఛ ఆటో డ్రైవర్లతో గొడవ పడుతున్నారు.  ఆరేండ్ల కిందట నిర్ణయించిన రూ. 50 వసూలు చేయాలని జీహెచ్ఎంసీ మేయర్, అధికారులు సూచిస్తున్నారు.  అంత తక్కువ తీసుకుంటే తాము బతికేదెట్లా అని ఆటో డ్రైవర్లు అంటున్నారు. ఎప్పుడో నిర్ణయించిన రేట్లను కొనసాగిస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.  ఒక్కో స్వచ్ఛ ఆటో డైలీ 40 నుంచి 60  కిలోమీటర్లు తిరుగుతుంది. ఒక్కోసారి ఇంతకు ఎక్కువగానే వెళ్లాల్సి ఉంటుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆటో ఇంజన్​ ఆన్​లోనే ఉంచాల్సి ఉంది. ఇందుకు డైలీ దాదాపు 4 నుంచి 6  లీటర్ల డీజిల్​ఖర్చవుతుంది. ప్రస్తుతం డీజిల్​ ధర వందకు చేరడంతో రోజుకు 400 నుంచి 600 వరకు డీజిల్ ​పోయిస్తున్నారు. నెలకి వస్తున్న దాంట్లో సగం డీజిల్​కే పోతున్నాయని ఆటో డ్రైవర్లు అంటున్నారు. డీజిల్​, మెయింటెనెన్స్​ ఖర్చులు బల్దియా ఇవ్వాలని కార్మికులు కోరుతున్నారు.
బండి ఇచ్చి చేతులు దులుపుకుని..
ఓనర్​ కమ్​ డ్రైవర్​ స్కీమ్​ కింద డౌన్​ పేమెంట్​ తీసుకొని జీహెచ్ఎంసీ స్వచ్ఛ ఆటోలను అందించింది. ఆటోలకు సంబంధించిన కిస్తీలను  బ్యాంకులకు బల్దియానే చెల్లిస్తుంది. అయితే వెహికల్స్​ని తీసుకున్న లబ్దిదారులు చెత్తను కలెక్ట్​ చేసిన ట్రాన్స్​ ఫర్​ స్టేషన్​కు తరలించాలి. చెత్తను తీసుకెళ్లినందుకు ఒక్కో ఫ్యామిలీ వద్ద  రూ.50   తీసుకోవాలన్న నిబంధనలను పెట్టింది. ఇలా 600 ఇండ్ల నుంచి కలెక్ట్ చేసిన కూడా నెలకి 30 వేలు వస్తున్నాయి. ఇందులో డీజిల్​కే సగం పోతున్నాయని డ్రైవర్లు అంటున్నారు. ప్రతి నెల ఆటో మెయింటెనెన్స్​ పోనూ తమకు పెద్దగా ఏమీ మిగలడం లేదని చెప్తున్నారు.  దీంతో ప్రతి  రూ.50 కంటే ఎక్కువగా తీసుకుంటున్నామంటున్నారు. లేకపోతే జీహెచ్​ఎంసీ తరఫున  తమకు వేతనం ఇస్తే బాగుటుందని డ్రైవర్లు  కోరుతున్నారు.
వచ్చే  పైసలు ఆటో రిపేర్లకే..
ఆరేండ్ల కిందట ఓనర్​ కమ్​ డ్రైవర్​ స్కీమ్​ కింద స్వచ్ఛ ఆటో తీసుకున్న. ఇప్పుడది పాతది కావడంతో మెయింటెనెన్స్​ కు చాలా ఖర్చు అవుతోంది. బోరు మోటారు కాలిపోతే రూ. 5 వేలకు పైగా ఖర్చు చేసిన. డీజిల్​ ధరలు పెరిగనప్పటి నుంచి పైసలేమీ మిగులుత లేవు. పొద్దుగాల పోతే సాయంత్రం ఇంటికొస్తున్న. నెలకి 10 వేలు రాకపోతే కష్టమే.                                                                                                      - అస్రత్, స్వచ్ఛ ఆటో డ్రైవర్​
మెయింటెనెన్స్ పైసలు లేదా జీతాలు ఇవ్వాలె 
చెత్త సేకరణపై బల్దియా స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలె. స్వచ్ఛ ఆటోలను పెట్టి చేతులు దులుపుకుంటే ఎట్ల. ఇంటికి 50 రూపాయలు తీసుకోవాలని బల్దియా గతంలోనే నిర్ణయించింది. ఆ పైసలు సరిపోవడం లేదని ప్రస్తుతం ఆటో డ్రైవర్లు 100 రూపాయలు తీసుకుంటున్నారు. ఈ విధానాన్ని రద్దు చేసి చెత్తను ఫ్రీగా సేకరించేలా బల్దియా చర్యలు తీసుకోవాలె.  ఆటో డ్రైవర్లకు మెయింటెనెన్స్ ​ఖర్చులు లేదా జీతం ఇచ్చి ఔట్​సోర్సింగ్​ పద్ధతిలో పని చేయించాలె.                                                                                                                          - దేవర కరుణాకర్, గుడిమల్కాపూర్ కార్పొరేటర్
కొత్త బండ్లు లేనట్టేనా..
స్వచ్ఛ ఆటోల సంఖ్య పెంచుతున్నామని మంత్రి కేటీఆర్​ పదే పదే చెప్తున్నారు. కానీ అందుకు సంబంధించిన చర్యలు తీసుకోలేకపోతున్నారు.  ఏడేళ్లలో విడత వారీగా  2,850 వెహికల్స్​ను అందుబాటులో తీసుకొచ్చారు. ఇటీవల 650 ఆటోలు వస్తున్నాయన్నప్పటికి అందులో సగం మాత్రమే వచ్చాయి. త్వరలో మరిన్ని తీసుకొస్తామంటున్నా  రావడం లేదు. ప్రస్తుతం గ్రేటర్​ జనాభాకు దాదాపు 10 వేల ఆటోలు అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. పాత ఆటోల కిస్తీలు చెల్లించకపోవడంతోనే కొత్త ఆటోలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రావడం లేదని  సమాచారం.