
- మొదటి దశలో 11 ఇంటిగ్రేటెడ్ భవనాల్లోకి 39 సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లు
- ఆర్మూర్, కూసుమంచి ఎస్‌ఆర్‌వో ఆఫీసుల్లో ప్రయోగాత్మకంగా ఈ-ఆధార్ సంతకం
- త్వరలో అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లోనూ అమలు: మంత్రి పొంగులేటి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోనే తొలిసారిగా గచ్చిబౌలిలో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవనానికి సీఎం రేవంత్ రెడ్డి బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. గచ్చిబౌలిలోని తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్‌మెంట్ కార్యాలయంలో ఈ ఇంటిగ్రేటెడ్ కార్యాలయ భవనాన్ని నిర్మించనున్నారు. ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులతో ప్రజలకు అత్యుత్తమ సేవలు అందుతాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
మొదటి దశలో 11 ఇంటిగ్రేటెడ్ ఆఫీసు భవనాలను నిర్మించి.. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లోని 39 సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలను వాటిలోకి తరలించనున్నట్టు మంత్రి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా రంగారెడ్డి, గండిపేట, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ కార్యాలయాలను గచ్చిబౌలిలోని ఇంటిగ్రేటెడ్ కార్యాలయంలోకి మార్చనున్నారు. అబ్దుల్లాపూర్, పెద్ద అంబర్‌పేట్, హయత్‌నగర్, వనస్థలిపురం కార్యాలయాలను కోహెడ ఆఫీసులోకి.. మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, శంషాబాద్ కార్యాలయాలను మంకాల్ (మహేశ్వరం మండలం) వద్దకు.. మేడ్చల్, కుత్బుల్లాపూర్, కీసర, శామీర్‌పేట కార్యాలయాలను కండ్లకోయ వద్దకు.. ఉప్పల్, నారపల్లి, కాప్రా, ఘట్‌కేసర్, మల్కాజిగిరి కార్యాలయాలను బోడుప్పల్ వద్దకు.. బంజారాహిల్స్, ఎస్‌ఆర్ నగర్, గోల్కొండ కార్యాలయాలను బంజారాహిల్స్ ఆఫీసులోకి.. ఆజంపురా, చార్మినార్, దూద్‌బౌలి కార్యాలయాలను మలక్‌పేట వద్ద నిర్మించే ఇంటిగ్రేటెడ్ భవనాల్లోకి తరలించనున్నారు. మరో 13 సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల కోసం నాలుగు చోట్ల ఇంటిగ్రేటెడ్ భవనాల నిర్మాణానికి స్థలాలను గుర్తించాలని సంబంధిత జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు.
రిజిస్ట్రేషన్లకు ఇక ఈ–ఆధార్ సంతకం..
ప్రజల సమయాన్ని ఆదా చేసేందుకు, పారదర్శకంగా, అవినీతి రహితంగా సేవలు అందించేందుకు ప్రవేశపెట్టిన స్లాట్ బుకింగ్ విధానం విజయవంతమైందని మంత్రి పొంగులేటి తెలిపారు. ఏప్రిల్ 10 నుంచి దశలవారీగా అమలులోకి వచ్చిన ఈ విధానం ద్వారా ఇప్పటివరకు దాదాపు 3 లక్షల స్లాట్ బుకింగ్‌లు నమోదయ్యాయని, రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ఈ–-ఆధార్ సంతకం విధానాన్ని కూడా తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. ప్రయోగాత్మకంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, ఖమ్మం జిల్లా కూసుమంచి సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ విధానం ఇప్పటికే అమలులో ఉందని, త్వరలో రాష్ట్రంలోని అన్ని కార్యాలయాలకు దీన్ని విస్తరిస్తామని మంత్రి తెలిపారు.