గ్రీన్ ఎనర్జీ కోసం అదానీ 100 బిలియన్ డాలర్ల పెట్టుబడి

గ్రీన్ ఎనర్జీ కోసం అదానీ 100 బిలియన్ డాలర్ల పెట్టుబడి

న్యూఢిల్లీ : బిలియనీర్ గౌతమ్ అదానీ గ్రూప్ రాబోయే 10 ఏళ్లలో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి, వాడకం కోసం 100 బిలియన్ డాలర్లు (8.20 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టనుంది. 2050 నాటికి నెట్​ జీరో కార్బన్‌ ఎమిటర్​గా మారాలని టార్గెట్​ పెట్టుకుంది. ఇందుకోసం అదానీ గ్రూపు రెన్యువబుల్​ ఎనర్జీ పోర్ట్‌‌‌‌ఫోలియోను 45 గిగావాట్‌‌‌‌లకు విస్తరిస్తోంది. అలాగే సోలార్ ప్యానెల్‌‌‌‌లు, విండ్ టర్బైన్‌‌‌‌లు, హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్‌‌‌‌లను తయారు చేయడానికి మూడు గిగా ఫ్యాక్టరీలను నిర్మిస్తోంది.

గ్రూప్​లోని ఐదు పోర్ట్‌‌‌‌ఫోలియో కంపెనీలను 2050 లేదా అంతకు ముందు నెట్​ జీరోగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీటిలో అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, పవర్ ట్రాన్స్‌‌‌‌మిషన్ యుటిలిటీ, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్,   అదానీ పోర్ట్స్ అండ్​ సెజ్ లిమిటెడ్,  ఏసీసీ, అంబుజా సిమెంట్స్ ఉన్నాయి. గ్రీన్​ఎనర్జీని పెంచడంలో భాగంగా ఆపరేషన్లను విద్యుదీకరిస్తోంది. బయోఫ్యూయల్స్​వినియోగాన్ని పెంచుతోంది. వేస్ట్​హీట్​ రికవరీ, ఎనర్జీ స్టోరేజీ టెక్నాలజీలను వాడుతోంది. నెట్ జీరో ట్రాన్సిషన్‌‌‌‌ కోసం హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ ట్రక్కుల అభివృద్ధి వంటి పైలట్ ప్రాజెక్ట్‌‌‌‌లను తమ వ్యాపారాలు ప్రారంభించామని అదానీ గ్రూప్ తెలిపింది. 

శక్తి నిల్వ,  వేడి, మొబిలిటీ కోసం గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా వాడుతామని తెలిపింది. స్కోప్-2 ఉద్గారాల తగ్గింపు కోసం రెన్యువబుల్​ విద్యుత్‌‌‌‌ వాడకాన్ని పెంచడం, బ్యాటరీలు,  హైడ్రోజన్ వంటి శక్తి నిల్వ సాంకేతికతలను ఉపయోగిస్తుంది. ఇంధన పరివర్తన కోసం కేటాయించిన గ్రూప్  100 బిలియన్​ డాలర్లలో 70 శాతం పెట్టుబడులను క్లీన్ ఎనర్జీ కోసం కేటాయించామని తెలిపింది. ఇది 10 గిగావాట్ల సోలార్ ప్యానెల్స్, 10 గిగావాట్ల విండ్ టర్బైన్లు,  5 గిగావాట్ల హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్‌‌‌‌లను తయారు చేయడానికి గిగా ఫ్యాక్టరీలను నిర్మిస్తోంది.