అదానీ వావ్ : ఐదేళ్లలో 2 లక్షల కోట్లు.. లక్ష ఉద్యోగాలు ఇస్తా

అదానీ వావ్ : ఐదేళ్లలో 2 లక్షల కోట్లు.. లక్ష ఉద్యోగాలు ఇస్తా

రానున్న ఐదేళ్లలో గ్రీన్ ఎనర్జీ, పునరుత్పాదక రంగాల్లో గుజరాత్‌లో రూ. 2 లక్షల కోట్ల భారీ పెట్టుబడులు పెట్టాలని అదానీ గ్రూప్ యోచిస్తున్నట్లు వెల్లడించింది. వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్ 2024లో పాల్గొన్న అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ.. ఈ పెట్టుబడి 1 లక్షకు పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలను సృష్టించడంలో సహాయపడుతుందని అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా గ్రీన్ సప్లై చెయిన్‌ను విస్తరిస్తున్నామని, అతిపెద్ద ఇంటిగ్రేటెడ్, పునరుత్పాదక ఇంధన పర్యావరణ వ్యవస్థను రూపొందిస్తున్నామన్నారు. రాబోయే ఐదేళ్లలో, అదానీ గ్రూప్ గుజరాత్‌లో రూ. 2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడి పెడుతుందని అదానీ ఈ సదస్సులో చెప్పారు.

గుజరాత్ కోసం పెట్టుబడి ప్రణాళికను వివరించడంతో పాటు, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం సాధించిన అద్భుతమైన ఆర్థిక వృద్ధిని అదానీ నొక్కిచెప్పారు. గత సమ్మిట్‌లో అదానీ గ్రూప్ రూ.55వేల కోట్లకు గాను ఇప్పటికే రూ.50వేల కోట్లు ఖర్చు చేసిందని అదానీ చెప్పారు. మునుపటి సమ్మిట్‌లో, 2025 నాటికి తమ పెట్టుబడి రూ. 55వేల కోట్లకు పైగా ఉంటుందని ప్రకటించానన్న ఆయన.. వివిధ రంగాలలో తాము ఇప్పటికే రూ. 50వేల కోట్లను పెట్టామన్నారు. దాంతో పాటు 25వేల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాల లక్ష్యాన్ని కూడా అధిగమించామని అదానీ తెలిపారు.

ప్ర‌ధాని మోదీ నేతృత్వంలో 2047 నాటికి మ‌న‌ది అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంద‌ని అదానీ అన్నారు. ప్ర‌పంచ ప‌ఠంపై భార‌త్‌ను శ‌క్తివంత‌మైన దేశంగా నిలిపార‌ని, ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్‌ను రూపొందిస్తున్న‌ట్లు అదానీ త‌న ప్ర‌క‌ట‌న‌లో మోదీని మెచ్చుకున్నారు.