పెళ్లికి అనుమతి ఇవ్వండి.. కోర్టుకెక్కిన ఇద్దరబ్బాయిలు

పెళ్లికి అనుమతి ఇవ్వండి.. కోర్టుకెక్కిన ఇద్దరబ్బాయిలు

వివాహానికి అనుమతి కోరుతూ ఓ స్వలింగ సంపర్క జంట సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తామిద్దరూ 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్నామని.. పెళ్లికి అనుమతించాలని ఉత్కర్ష్‌ సక్సేనా, అనన్య కోటియా అనే ఇద్దరు యువకులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విదేశాల్లో విద్యాభ్యాసం చేస్తున్న వీరు.. కొన్నేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. అయితే ఈ జంటతో పాటు మరో ముగ్గురు తమ వివాహాలకు అనుమతినివ్వాలని కోర్టును కోరగా.. మార్చిలో విచారణ చేపడతామని ధర్మాసనం తెలిసింది. ఒకవేళ వీరి వివాహాలకు చట్టబద్ధత లభిస్తే.. తైవాన్‌ తర్వాత స్వలింగ సంపర్క వివాహాలను చట్టబద్ధం చేసిన రెండో ఆసియా దేశంగా భారత్‌ నిలవనుంది.

ఉత్కర్స్, కోటియాలు 2008 నుంచి ప్రేమలో ఉన్నారు. భారత్‌లో స్వలింగ సంపర్కానికి ఆమోదం లేకపోవడంతో ప్రజల ఆలోచనలు మారతాయేమోనని ఇప్పటివరకు వేచి చూశామని ఈ జంట తమ పిటిషన్‌లో చెప్పింది. సమాజంలో ప్రజల ఆలోచనలు క్రమంగా మారుతున్న తరుణంలో.. ఇటీవల కాలంలో LGBTQ వ్యక్తులు తమ లైంగికతను బహిరంగంగా ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోనే సక్సేనా, కోటియాలు తమ బంధం గురించి కుటుంబ సభ్యులు, స్నేహితులకు చెప్పాలని నిర్ణయించుకున్నారు. వారిలో చాలా మంది తమ బంధాన్ని అంగీకరించారని, కానీ సామాజిక కోణంలో ఇంకా ఆమోదం లభించలేదని అన్నారు.