జీసీసీకి మరింత బూస్ట్.. పెట్రోల్ బంకుల సంఖ్య పెంచాలని నిర్ణయం

జీసీసీకి మరింత బూస్ట్..  పెట్రోల్ బంకుల సంఖ్య పెంచాలని నిర్ణయం
  • ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.500 కోట్లతో యాక్షన్ ప్లాన్​కు ఆమోదం

హైదరాబాద్, వెలుగు: గిరిజన కోఆపరేటివ్ కార్పోరేషన్ (జీసీసీ) బలోపేతంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా గిరిజనుల నుంచి కొనుగోలు చేస్తున్న అటవీ ఉత్పత్తులను మరింత పెంచటంతో పాటు జీసీసీ ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్ బంకులను సైతం కొత్త ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని అధికారులు ప్లాన్  రూపొందించారు. వీటితో పాటు గత మూడేళ్లుగా వరి కొనుగోలు కేంద్రాలను సైతం జీసీసీ నిర్వహిస్తోంది. ఎస్టీ గురుకుల హాస్టల్స్ కు జీసీసీనే సరుకులను సరఫరా చేస్తోంది. రానున్న రోజుల్లో ఈ కొనుగోలు కేంద్రాల సంఖ్యను సైతం పెంచాలని చూస్తున్నారు. త్వరలో కార్పొరేషన్ పై ప్రత్యేకంగా ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తామని అధికారులకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్  హామీ ఇచ్చారు. 

ఇందులో కార్పొరేషన్  పనితీరు, ప్రభుత్వం వైపు నుంచి సాయం వంటి అంశాలపై  అధికారుల నుంచి పలు సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.500 కోట్లతో యాక్షన్ ప్లాన్ ను ఆమోదించారు. జీసీసీలకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 31 పెట్రోల్  బంకుల్లో 12 బంకులు లాభాల్లో ఉన్నాయి. మిగతా బ్రేక్ ఈవెన్ గా నడుస్తున్నాయని జీసీసీ అధికారులు చెబుతున్నారు. ఈ బంకులు జీసీసీ ఆధ్వర్యంలో పనిచేస్తుండగా ఇందుల్లో ఎంప్లాయిస్ గా  కేవలం ట్రైబల్స్ నే నియమిస్తున్నారు. కాగా.. జీసీసీ బలోపేతానికి దశలవారీగా రూ.50 కోట్లు రిలీజ్  చేయాలని ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు.