ఒకప్పుడు విలాసాలుగా భావించిన ‘మాచా టీ’, ‘మేకప్’, ‘కాన్సర్ట్స్’ వంటివి ఇప్పుడు జెన్ – జెడ్కి కేవలం సరదా కాదు. అవి మానసిక ప్రశాంతత ఇచ్చే సెల్ఫ్ కేర్ మెథడ్స్. గత తరాలతో పోలిస్తే వీళ్ల లైఫ్ స్టయిల్ పూర్తిగా భిన్నంగా మారింది. ఈ కొత్త ధోరణి వెనుక ఉన్న ముఖ్య కారణాలు ఇవే.
నా కోసం నేను చేసుకోవాలి
పాత తరాల్లో భవిష్యత్తు కోసం వర్తమానాన్ని త్యాగం చేసేవాళ్లు. కానీ నేటి యువత “రేపు గ్యారెంటీ లేదు, కాబట్టి ఈ క్షణాన్ని ఆస్వాదించాలి” అని నిర్ణయించుకుంది. తాము కష్టపడి సంపాదించిన డబ్బును తమ సంతోషం కోసం ఖర్చు చేయడం బాధ్యతారాహిత్యం కాదు.. సెల్ఫ్ రెస్పెక్ట్ అని బలంగా నమ్ముతున్నారు.
లిప్‌స్టిక్ ఎఫెక్ట్
ఆర్థికంగా ఒత్తిడిలో ఉన్నప్పుడు చిన్న చిన్న యాక్టివిటీల్లో సంతోషం వెతకడాన్ని ‘లిప్‌స్టిక్ ఎఫెక్ట్’ అంటారు.
మాచా టీ: ఇది మామూలు డ్రింక్ కాదు. అందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు మనసును శాంతంగా ఉంచుతాయి. ఒక కప్ మాచా తాగడం రోజువారీ ఒత్తిడికి చిన్న బ్రేక్ లాంటిది.
మేకప్: ఇతరుల కోసం వేసుకునేది కాదు. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి ఒక థెరపీ అంటోంది జెన్ జీ.
ఎక్స్పీరియెన్స్ ఎవ్రీథింగ్
ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో పెద్ద ఇళ్లు, కార్లు కొనడం కష్టం కావడంతో యువత దృష్టి అనుభవాల వైపు మళ్లింది. వాటిలో భాగంగానే కాన్సర్ట్స్కి వెళ్లడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఫేవరెట్ సింగర్ కాన్సర్ట్కి వెళ్లడం కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం కాదు.. లైఫ్లాంగ్ గుర్తుండిపోయే జ్ఞాపకం. ‘డబ్బును దాచి పెట్టడం కంటే, దాంతో సంతోషకరమైన క్షణాలు సృష్టించుకోవడమే బెటర్ కదా’ అంటోంది ఈ తరం.
బాధ్యతాయుతమైన ఖర్చు
డబ్బును వృథా చేయడం లేదు. ‘కాన్షియస్ స్పెండింగ్’ అనే విధానాన్ని అనుసరిస్తున్నాం అంటున్నారు. అంటే.. ఆదాయంలో కొంత భాగం సిప్, ఇన్సూరెన్స్ కట్టడం ద్వారా భవిష్యత్తు కోసం కేటాయిస్తున్నారు. మిగిలినది తమ సంతోషం కోసం ఖర్చు చేస్తున్నారు. అందులో రిగ్రెట్ ఫీలవ్వాల్సిన పనిలేదని గట్టిగా చెప్తున్నారు. గత తరాలు ఇవన్నీ “వృథా ఖర్చులు” అని అనుకున్నా, నేటి యువతకు ఇవి మానసిక ఆరోగ్యాన్ని కాపాడే ముఖ్య సాధనాలయ్యాయి. “నా సంతోషం కోసం ఈ చిన్న ఖర్చులు చేయడానికి నాకు అర్హత ఉంది” అనే భావన ఈ తరంలో బలంగా కనిపిస్తోంది.

