సమానత్వానికి ఆమె దూరం..యూఎన్ రిపోర్ట్

సమానత్వానికి ఆమె దూరం..యూఎన్ రిపోర్ట్

మహిళా దినోత్సవం వచ్చేసింది. జబ్బలు చరుచుకుంటూ మహిళల అభివృద్ధి కోసం ఊకదంపుడు ఉపన్యాసాలను దంచికొడుతున్నాం. సమానత్వం ఇవ్వాలని, వాళ్లతోనే దేశాలు అభివృద్ధి చెందుతాయని కోట్ల గళాలు నినదిస్తున్నాయి. మరి, ఆ గళ నినాదాలు నిజం అవుతున్నాయా? అంటే అబ్బే లేదంటోంది ఐక్యరాజ్యసమితి. ఏ ఏడాదికి ఆ ఏడాది ఉపన్యాసాలతోనే సరిపెడుతున్నాం తప్ప, సమానత్వం కోసం చేస్తున్న పనులు, తీసుకుంటున్న చర్యలు సరిపోవట్లేదంటోంది. ఒక్కరోజు ఉపన్యాసాలకే పరిమితమైపోతున్నాయి తప్ప, మహిళలకు సమానత్వమన్నది అందట్లేదని వాపోయింది. ఆ దేశం, ఈ దేశం కాదు.. అసలు ఏ దేశమూ ఆమెకు సమానత్వాన్ని ఇవ్వలేకపోయిందని ఆవేదన చెందింది. మహిళల సమానత్వం కోసం 25 ఏళ్ల క్రితం చేసుకున్న బీజింగ్​ డిక్లరేషన్​ను సమర్థంగా అమలు చేయలేకపోతున్నామని వెల్లడించింది. జాబ్​లు, రాజకీయాలు, ఆరోగ్యం, చదువు వంటి విషయాల్లో సరైన హక్కులకు మహిళలు నోచుకోలేకపోతున్నారని వెల్లడించింది. ‘జెండర్​ ఈక్వాలిటీ: 25 ఏళ్ల బీజింగ్​ డిక్లరేషన్ లో మహిళల హక్కులు’ పేరిట యూఎన్​ వుమెన్​ రిపోర్టును విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా మహిళల పరిస్థితిని కళ్లకు కట్టింది.