భారత్, పాకిస్తాన్ యుద్ధం బాలీవుడ్ సినిమాలా ఉండదు : ఆర్మీ మాజీ చీఫ్ నరవణే

భారత్, పాకిస్తాన్ యుద్ధం బాలీవుడ్  సినిమాలా ఉండదు : ఆర్మీ మాజీ చీఫ్ నరవణే
  • దాని గాయాలు తరతరాలు వెంటాడుతాయి
  • వార్ కంటే దౌత్యానికే ప్రాధాన్యం ఇవ్వాలని వ్యాఖ్య

న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణపై వస్తున్న విమర్శలకు ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణే కౌంటర్ ఇచ్చారు. రొమాంటిక్ గా ఉండడానికి యుద్ధమేమీ బాలీవుడ్ సినిమా కాదన్నారు. యుద్ధం తాలూకు గాయాలు తరతరాలు వెంటాడుతాయని వెల్లడించారు. అందుకే యుద్ధం కంటే దౌత్యానికే మొదటి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఆదివారం మహారాష్ట్రలోని పుణెలో జరిగిన ఓ కార్యక్రమంలో నరవణే మాట్లాడుతూ.. "కొందరు పూర్తిస్థాయి యుద్ధానికి ఎందుకు వెళ్లలేదని అడుగుతున్నారు. 

ప్రభుత్వం ఆదేశిస్తే నేనూ యుద్ధానికి వెళ్తా. కానీ, దౌత్యపరమైన చర్చలకే మొదట ప్రాధాన్యం ఇస్తా. యుద్ధం అనేది రొమాంటిక్ గా ఉండదు. అదేమీ బాలీవుడ్ సినిమా కాదు. యుద్ధం చాలా తీవ్రమైన అంశం. దాని గాయాలు తరతరాలు వెంటాడుతాయి. ఎన్నో కుటుంబాలు తమ ప్రియమైనవారిని కోల్పోవాల్సి రావచ్చు. ఎప్పుడైనా సరే యుద్ధం లేదా హింస అనేవి లాస్ట్ ఆప్షన్స్ కావాలి. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇది యుద్ధ యుగం కాదని చెబుతూ వస్తున్నారు. తెలివితక్కువ వ్యక్తులు యుద్ధాన్ని రుద్దడానికి ప్రయత్నిస్తే.. మనం దాన్ని ప్రోత్సహించకూడదు. దౌత్యానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రతిదానికి హింస సమాధానం కాదు" అని మనోజ్ నరవణే  పేర్కొన్నారు.