మీకు నచ్చిన దేశాల నుంచి క్రూడాయిల్ కొనాలా..? భారత్‌పై పెత్తనం కుదరదు: జనరల్ నరవాణే

మీకు నచ్చిన దేశాల నుంచి క్రూడాయిల్ కొనాలా..? భారత్‌పై పెత్తనం కుదరదు: జనరల్ నరవాణే

భారతదేశం రష్యా నుంచి చమురు కొనుగోలుపై అమెరికా నుంచి వస్తున్న వ్యతిరేతపై తీవ్రంగా స్పందించారు మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే. అసలు ఇండియా ఏం చేయాలో వేరేవారు ఎందుకు నిర్థేశించాలన్న ఆయన.. భారత్ తన సొంత ప్రయోజనాల కోసం వేరేవారి ఆజ్ఞలు ఫాలో అవ్వాల్సిన లేదా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. భారత్ ఎల్లప్పుడూ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి విధానాన్ని అనుసరిస్తుందని తేల్చి చెప్పారు నరవాణే. 

భారత్ అమెరికా డిమాండ్లకు ఎందుకు అంగీకరించదు అనే ఆంశంపై ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన ఈ కామెంట్స్ చేశారు. రష్యా నుంచి యూరప్ కూడా గ్యాస్ కొంటోందని, అమెరికా కూడా రష్యా నుంచి కొన్ని వస్తువులు దిగుమతి చేసుకుంటోందని అన్నారు. అలాంటప్పుడు కేవలం ఇండియానే ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటూ ప్రశ్నించారు. మరోపక్క టర్కీ భారీగా రష్యా చమురు, గ్యాస్ ఉత్పత్తులను అమ్ముకుంటూ లాభపడుతుంటే కనీసం దాని గురించి ప్రస్థావన కూడా ఎందుకు లేదనే వాదనలు కూడా అమెరికా తీరుపై వినిపిస్తున్నాయి. 

దేశ ప్రజల ప్రయోజనాలే ముఖ్యమన్న నరవాణే.. వేరే చోట నుండి ఎక్కువ ధరకు కొనుగోలు చేసి మన స్వంత దేశంలో ద్రవ్యోల్బణాన్ని పెంచాలా? అంటూ ఫైర్ అయ్యారు. భారత్ తన ప్రయోజనాల కోసం ఏది మంచిదో అదే చేస్తుందని.. ప్రపంచంలో అన్ని దేశాలూ చేసేది ఇదేనని అన్నారు. ఇండియాకు వ్యతిరేకంగా మారే అవకాశం ఉన్న దేశంపై "ఇంధనం కోసం ఆధారపడటం" తెలివైనదా అని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ భారత్ ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల నుంచి ఆయిల్ కొంటోందని చెప్పారు. కానీ అమెరికా వెనిజులా, రష్యా, ఇరాన్ నుంచి కొనొద్దంటూ డిక్టేట్ చేయటం దాని స్వార్థ ప్రయోజనాల కోసమేనన్నారు. 

ఇదే క్రమంలో షాంఘై సదస్సులో ప్రధాని మోడీ పుతిన్, జిన్ పింగ్ లను కలవటంపై మాట్లాడుతూ.. అది ట్రంప్ కి గుణపాఠం నేర్పటానికి కాదని..వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి విధానంలో భాగంగా భారత ఎంపికలు ఉంటాయని చెప్పారు నరవాణే. ప్రస్తుతం అమెరికాతో భారత్ అద్భుతమైన సంబంధం కలిగి ఉందని.. ఇతర దేశాలతో మాదిరిగానే కొద్ది హెచ్చుతగ్గులు ఉన్నాయి అంతే అన్నారు. అన్ని దేశాలతో సంబంధాలు ఒకే స్థాయిలో పనిచేయవని, రాజకీయ, దౌత్య, వాణిజ్యం, సైనిక, ప్రజల నుండి ప్రజలకు సంబంధాలు వంటి అనేక అంశాలను కలిగి ఉంటుందని జనరల్ నరవాణే వివరించారు.