దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన చాణక్య రక్షణ సదస్సులో పాల్గొన్న భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది కీలక కామెంట్స్ చేశారు. ఈ ఏడాది మే నెలలో జరిగిన ఆపరేషన్ సిందూర్ కేవలం ట్రైలర్ మాత్రమేనని.. పాకిస్తాన్ మళ్లీ దారి తప్పితే తగిన పాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నట్లు ఘాటుగా హెచ్చరించారు.
ఆపరేషన్ సిందూర్ 88 గంటల పాటు కొనసాగగా.. అందులో పాక్ లోని ప్రధాన ఉగ్రవాద శిబిరాలు, టెర్రర్ లాంచ్‌ప్యాడ్‌లు, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని సైనిక మౌలిక సదుపాయాలపై కచ్చితమైన దాడి జరిపాయి భారత సాయుధ దళాలు. ఈ ఆపరేషన్ తర్వాత పాకిస్తాన్ తానే కాల్పుల విరమణ కోరడం దాడి ప్రభావాన్ని స్పష్టంగా చూపించింది. ఇది కేవలం సైనిక విజయమే కాదు భారత వ్యూహాత్మక ప్రతిఘటన సామర్థ్యానికి ప్రతీక కూడా.
ఈ రోజు యుద్ధాలు బహుళ మాధ్యమాల్లో జరుగుతున్నాయని జనరల్ ద్వివేది స్పష్టంగా పేర్కొన్నారు. భూమి, ఆకాశం, సైబర్ రంగం, సమాచార యుద్ధం అన్నీ కలసి సమగ్ర యుద్ధం అవుతున్నాయని సదస్సులో మాట్లాడుతూ చెప్పారు. యుద్ధం ఎంత సేపు సాగుతుందో చెప్పలేమని, కానీ దీర్ఘకాలం కోసం అవసరమైన సరఫరాకు సిద్ధంగా ఉండాలి అంటూ భవిష్యత్ యుద్ధ సంసిద్ధతపై మాట్లాడారు.
గతవారం పాకిస్తాన్‌లో జరిగిన 27వ రాజ్యాంగ సవరణ ఆ దేశ సైనిక నిర్మాణంలో భారీ మార్పులకు దారి తీస్తోంది. ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ ఇప్పుడు.. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌పై ఏకాధిపత్యం పొందబోతున్నారు. జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ రద్దవడం ద్వారా పాకిస్తాన్ వ్యూహాత్మక సమతుల్యత దెబ్బ తినే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఈ మార్పు ప్రకటన వచ్చిన సమయంలోనే జనరల్ ద్వివేది కామెంట్స్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
జనరల్ ద్వివేది సూచించిన “న్యూ నార్మల్” విధానం.. “టాక్స్ అండ్ టెరర్ కెనాట్ గో టుగెదర్” అన్న సూత్రంపై భారత విధానాన్ని దృఢపరిచింది. అంటే ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశాలతో మాటలు ఉండబోవననే సందేశం ఇది. ఇప్పుడు ఇండియాని ఎవ్వరూ బ్లాక్ మెయిల్ చేయలేరని ద్వివేది భద్రతపై ధీమా వ్యక్తం చేశారు. భారత సైన్యం ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో, క్రమశిక్షణతో, భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనే స్థితిలో ఉందనడానికి ఆయన వ్యాఖ్యలు సంకేతం అంటున్నారు యుద్ధ నిపుణులు. సరిహద్దుల్లో భారత వ్యూహం ఇప్పుడు ప్రతిస్పందనాత్మకం కాకుండా.. నిరోధకాత్మక దిశగా మారటం ఆటను పూర్తిగా మార్చేసింది.
