తమిళనాడులో మైనర్లపై జరిగిన రెండు దారుణమైన నేరాలు ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. మదురైలోని ప్రసిద్ధ మీనాక్షి ఆలయం సమీపంలో 17 ఏళ్ల బాలుడు గుబేంద్రన్‌ను ఐదుగురు సభ్యుల ముఠా దారుణంగా హత్య చేసింది. అటు కోయంబత్తూరు జిల్లా సూలూరు సమీపంలో 10 ఏళ్ల బాలికపై జరిగిన అత్యాచారం, హత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమైంది. ఈ రెండు వరుస దారుణాలపై బీజేపీ నేత అన్నామలైతో సహా ప్రతిపక్ష నాయకులు సీఎం విజయ్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు.
ఈ ఘోరాలపై తమిళనాడు బీజేపీ అగ్రనేత కె. అన్నామలై ఎక్స్ వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కొత్త ప్రభుత్వం ఇంకా తన సంబరాల మూడ్ నుంచి బయటపడలేదని ఆయన ఎద్దేవా చేశారు. తమిళనాడులో మాదకద్రవ్యాల వ్యాపారులు, లైంగిక వేధింపులకు పాల్పడేవారు, హంతకులకు స్వేచ్ఛ లభిస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర పోలీసులు గతం నుండి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదని.. కొత్త టీవీకే ప్రభుత్వం ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో ఉన్న కఠోర వాస్తవాలను ఎదుర్కోవాలని అన్నామలై డిమాండ్ చేశారు.
అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్.. సీఎం విజయ్‌ను టార్గెట్ చేస్తూఎక్స్ వేదికగా ప్రశ్నలు సంధించారు.గౌరవనీయ ముఖ్యమంత్రి గారూ.. అసలు ఇది తమిళనాడునా, లేక ఉత్తర ప్రదేశా ? అంటూ ఉదయనిధి నిలదీశారు. ఎన్నికలకు ముందు వీరోచిత మాటలు మాట్లాడిన విజయ్.. రాష్ట్రాన్ని వణికిస్తున్న దారుణాలపై ఇప్పుడు ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు.
రాష్ట్రంలో మార్పు గురించి మాట్లాడిన వారి పాలనలో.. తమిళనాడులో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారిపోయాయని ఉదయనిధి స్టాలిన్ మండిపడ్డారు. సూలూరులో మైనర్ బాలిక దారుణ హత్యకు గురైతే.. ఇప్పుడు విల్లుపురం జిల్లాలో మరో బాలికపై లైంగిక దాడి జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా, సూలూరు బాలిక తల్లికి సమాచారం కూడా ఇవ్వకుండానే పోలీసులు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారని ఆరోపించారు. మధురై గుడి సమీపంలో బాలుడి హత్య, కోయంబత్తూరులో మహిళ ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి.. ఇవన్నీ రాష్ట్రంలో అరాచక పాలనకు అద్దం పడుతున్నాయని దుయ్యబట్టారు.
ALSO READ : బూత్ స్థాయిలో బలపడితే మళ్లీ కాంగ్రెస్ దే అధికారం
మరోవైపు, ఏఐఏడీఎంకే అగ్రనేత ఎడప్పాడి కె. పళనిస్వామి సైతం టీవీకే ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మహిళల భద్రతను నాశనం చేయడంలో ప్రస్తుత విజయ్ ప్రభుత్వం.. గత డీఎంకే ప్రభుత్వంలాగే మారిందా? అని ఈపీఎస్ ప్రశ్నించారు. అసలు తమిళనాడులో మహిళలకు, బాలికలకు భద్రత ఎక్కడ ఉందని నిలదీశారు. సీఎం విజయ్ తన ఎన్నికల హామీలను ఒకసారి గుర్తుచేసుకోవాలని.. రాష్ట్రంలో జరుగుతున్న వరుస నేరాలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని పళనిస్వామి డిమాండ్ చేశారు.
