
న్యూఢిల్లీ: బడ్జెట్ లెక్కల కోసం కొత్తగా డెవలప్‌మెంట్ ఫైనాన్షియల్ సంస్థ (డీఎఫ్‌ఐ)ను ఏర్పాటు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా డీఎఫ్‌ఐకి రూ.20 వేల నుంచి రూ.5 లక్షల కోట్ల వరకు కేటాయించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ మొత్తాన్ని వచ్చే మూడేళ్ల కోసం వినియోగించనున్నట్లు ఆమె చెప్పారు.
కాగా.. ఈ డీఎఫ్‌ఐ ఏర్పాటు కోసం కొత్తగా పేరు, లోగో, ట్యాగ్ లైన్‌ను సూచించాలని ప్రజలను కేంద్రం కోరింది. ఎవరైతే పేరు, లోగో, ట్యాట్ లైన్‌ను సూచిస్తారో వారికి నజరానా ఇస్తామని ప్రకటించింది. ఆగస్టు 15 లోగా ఆసక్తి కలిగిన వారు తమ ఎంట్రీలను పంపాలని పేర్కొంది. డీఎఫ్‌ఐ థీమ్‌కు తగ్గట్లుగా సృజనాత్మకతతో పేరు తదితర వాటిని సూచిస్తే ఎంపిక చేస్తామని స్పష్టం చేసింది. దేశ స్వాతంత్ర్యానికి 75 వసంతాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ స్ఫూర్తికి అద్దం పట్టేలా క్రియేటివిటీగా ఉండాలని పేర్కొంది. ఈ కాంపిటీషన్‌లో నెగ్గిన వారికి మొదటి బహుమతి కింద ఒక్కో కేటగిరీలో రూ.5 లక్షలు, రెండో ప్రైజ్ కింద రూ.3 లక్షలు, మూడో బహుమతిగా రూ.2 లక్షలు ఇవ్వనున్నట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది.