ఘనాలో వెలుగులోకి వచ్చిన మరో ప్రాణాంతక వైరస్

ఘనాలో వెలుగులోకి వచ్చిన మరో ప్రాణాంతక వైరస్

ఒకవైపు కరోనా, మరోవైపు మంకీపాక్స్ కలకలం కొనసాగుతుండగానే మరో మహమ్మారి ప్రపంచదేశాలను భయపెడుతోంది. ఆఫ్రికాలోని ఘనా దేశంలో ప్రాణాంతకమైన మార్బర్గ్ వైరస్ వెలుగు చూసింది. ఇప్పటి వరకు రెండు కేసులు బయటపడినట్లు ఘనా ప్రకటించింది. కొన్నాళ్ల క్రితం మరణించిన ఇద్దరు వ్యక్తులకు పరీక్షలు నిర్వహించగా.. ప్రాణాంతక వైరస్ నిర్థారణ అయినట్లు తెలిపింది. నిజానికి జులై 10న మార్బర్గ్ పాజిటివ్ గా తేలినప్పటికీ సెనెగల్ లోని ల్యాబ్ లో మరోసారి పరీక్షలు నిర్వహించినట్లు WHO ప్రకటించింది. సెనెగల్ లోని ఇన్ స్టిట్యూట్ పాస్టెర్ లో నిర్వహించిన పరీక్షల్లోనూ పాజిటివ్ గా తేలింది. 

మార్బర్గ్ కేసులు వెలుగులోకి వచ్చిన ప్రాంతాల్లో అధికారులు వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యలు చేపట్టారు. బాధితులతో కలిసిన 98 మందిని ఐసోలేషన్ కు తరలించామని, అయితే ఎవరిలోనూ వైరస్ లక్షణాలు కనిపించలేదని చెప్పారు. గతేడాది గినియాలో మార్బర్గ్ వైరస్ తొలికేసు నమోదుకాగా.. తాజాగా ఘనాలో రెండు వైరస్ లు వెలుగులోకి వచ్చాయి. ప్రాణాంతక మార్బర్గ్ వైరస్ కేసులు నమోదుకావడంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అప్రమత్తమైంది. ప్రపంచదేశాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరణించిన ఇద్దరు వ్యక్తుల్లో డయేరియా, ఇంటర్నల్ బ్లీడింగ్, జ్వరం తదితర లక్షణాలు కనిపించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.