- శోకసంద్రంలో సహజా రెడ్డి తల్లిదండ్రులు
- అమెరికాలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఘట్కేసర్ యువతి మృతి
- కూకట్పల్లి యువకుడు కూడా..
ఘట్కేసర్, వెలుగు: అమెరికాలోని బర్మింగ్‌హామ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా చౌదరిగూడకు చెందిన ఉడుముల సహజా రెడ్డి (24) మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. కడసారైనా కన్నబిడ్డను చూసుకోలేకపోయామని సహజ తల్లిదండ్రులు జయాకర్ రెడ్డి, శైలజ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వారి రోదనను చూసిన బంధువుల, స్థానికులు చలించిపోయారు. జయాకర్ రెడ్డి టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుండగా, శైలజ ప్రభుత్వ టీచర్. జనగామ జిల్లాకు చెందిన వీరికి ఇద్దరు కుమార్తెలు ఉండగా, ఘట్కేసర్మండలం చౌదరిగూడలోని శ్రీనివాస్‌నగర్‌కాలనీలో స్థిరపడ్డారు. చిన్న కుమార్తె ఇంటర్ పూర్తి చేసి హైదరాబాద్‌లోనే బీబీఎస్ కోసం ప్రత్యేకంగా కోచింగ్ తీసుకుంటోంది.
పెద్ద కుమార్తె సహజారెడ్డి 2021లో ఎంఎస్ చదువు కోసం అమెరికాలోని బర్మింగ్‌హామ్‌కు వెళ్లింది. బర్మింగ్ హామ్లో సహజారెడ్డి, కూకట్‌పల్లికి చెందిన అన్వేశ్, మరో ఇద్దరు స్నేహితులు కలిసి ఉంటున్నారు. గురువారం రాత్రి వీరి అపార్ట్మెంట్ పక్కనున్న మరో భవనం నుంచి భారీగా మంటలు రావడంతో వేగంగా వ్యాపించాయి. ప్రమాదవశాత్తు సహజారెడ్డి ఉంటున్న ఇంటికి మంటలు అంటుకున్నాయి. మంటల్లో చిక్కుకొని సహజా రెడ్డి, అన్వేశ్మృతి చెందగా, మరో ఇద్దరు తప్పించుకున్నారు. కూతురు మరణవార్త విన్న తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. తన కూతురు రోజూ వీడియో కాల్ చేసి మాట్లాడుతుండేదని. ఆమెకు ఉజ్వల భవిష్యత్తు ఉందని ఉప్పొంగి పోయేవాళ్లమని వాపోయారు. వచ్చే వారం సహజారెడ్డి డెడ్‌బాడీ స్వగ్రామానికి రానున్నట్లు బంధువులు తెలిపారు.
