
ఉత్తరప్రదేశ్‌లో ఘజియాబాద్ అలీఘర్ ఎక్స్‌ప్రెస్‌వే (NH 34)ను రికార్డు సమయంలో నిర్మించారు. కేవలం 100 గంటల్లో 100 కిలో మీటర్ల పొడవైన హైవేను నిర్మించినట్లు జాతీయ రహదారులు, రోడ్డు రవాణాశాఖ ప్రకటించింది. దీని ప్రకారం కేవలం నాలుగు రోజుల నాలుగు గంటల కాలంలోనే వంద కిలో మీటర్ల రహదారిని నిర్మించి రికార్డు సృష్టించారు.
వర్చువల్‌గా నిర్వహించిన ఓ కార్యక్రమంలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 118 కిలోమీటర్ల మేరకు ఉన్న ఘజియాబాద్, అలీఘర్ ఎక్స్ ప్రెస్ వే కీలకపాత్ర పోషిస్తుందని వెల్లడించారు. ఈ హైవే ఉత్తరప్రదేశ్‌లోని దాద్రి, గౌతమ్ బుద్ధ నగర్, సికందర్ బాద్, బులంద్‌షహర్, ఖుర్జాలను కలుపుతూ సాగుతుందన్నారు. అలాగే సరుకుల రవాణాకు హైవే కీలకంగా మారుతుందని చెప్పారు. ఈ రీజియన్ ఆర్థిక అభివృద్ధికి, పారిశ్రామిక ప్రాంతాలు, సాగు ప్రాంతాలను, విద్యా సంస్థలను ఈ ఎక్స్ ప్రెస్ వే దోహదపడుతుందని తెలిపారు.
ఘజియాబాద్ అలీఘర్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణంలో గ్రీన్ టెక్నాలజీని వినియోగించినట్లు నితిన్ గడ్కరీ తెలిపారు. దాదాపు 90 శాతం మిల్లింగ్ మెటీరియల్‌ను ఉపయోగించినట్లు చెప్పారు. దీనివల్ల హైవే నిర్మాణ సమయంలో పర్యావరణానికి హాని కలిగించే ఉద్గారాలను గణనీయంగా తగ్గించినట్లు పేర్కొన్నారు. తద్వారా కార్బన్ ఫుట్ ప్రింట్ చాలా వరకు తగ్గుతుందని వివరించారు.