నిర్బయ తరహాలో.. రన్నింగ్ కారులో మహిళపై అత్యాచారం

నిర్బయ తరహాలో.. రన్నింగ్ కారులో మహిళపై అత్యాచారం

ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో నిర్భయ తరహా ఘటన కలకలంరేపింది.  అప్పట్లో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఆ ఘటన తర్వాత కేంద్రం నిర్భయ చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఢిల్లీ ఘటన కదులుతున్న బస్సులో జరిగితే.. తాజాగా ఘజియాబాద్ లో కదులుతున్న కారులో ఓ మహిళపై అత్యాచారం జరిగింది.

ఘజియాబాద్ కు చెందిన మహిళకు సోషల్ మీడియాలో ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారింది. దాంతో మహిళను కలవడానికి ఆగష్టు 16న ఆ వ్యక్తి కారులో ఘజియాబాద్ కు వచ్చాడు. కాసేపు మాట్లాడుకున్న తర్వాత ఆమెను కారులో ఎక్కించుకున్నాడు. అయితే డ్రైవర్ కారు నడుపుతుంటే.. ఆ వ్యక్తి మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దాంతో ఆమె అతనికి ఎదురుతిరిగింది. రెచ్చిపోయిన ఆ వ్యక్తి మహిళను కొట్టి.. కారులోనే అత్యాచారం చేశాడు. అనంతరం ఢిల్లీలోని శాస్త్రి పార్క్ ప్రాంతానికి తీసుకెళ్లి.. డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత మహిళను అక్కడే వదిలేసి ఇద్దరూ పారిపోయారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. ఇంటికి చేరుకున్న బాధితురాలు.. మరుసటి రోజు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కారును గుర్తించి.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.