V6 News

అమీర్ పేట్, మైత్రివనం ఏరియాల్లో ఉంటున్న పబ్లిక్కు ఈ సంగతి తెలుసా..?

అమీర్ పేట్, మైత్రివనం ఏరియాల్లో ఉంటున్న పబ్లిక్కు ఈ సంగతి తెలుసా..?

హైదరాబాద్: గడచిన వర్షా కాలంలో.. జూబ్లీ హిల్స్, వెంకటగిరి, రహ్మత్ నగర్, యూసుఫ్ గూడ ప్రాంతాల నుంచి కృష్ణకాంత్ పార్క్ మీదుగా పారే కాలువ గాయత్రి నగర్ వద్ద ఉన్న నాలాలో కలవడం, ఈ ప్రాంతాలతో పాటు మధురానగర్, శ్రీనివాస్ నగర్ వెస్ట్ నుంచి భారీగా వరద రావడంతో అమీర్ పేట్, మైత్రివనం ప్రాంతాలు ముంపునకు గురైన సంగతి తెలిసిందే. 

అమీర్ పేట్, మైత్రీ వనం, సికింద్రాబాద్ ప్యాట్నీ నాలాల్లో విస్తరణ క్లియరెన్స్‌తో వరద ముప్పు తగ్గింది. ఈ విషయాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. హైదరాబాద్లో చేపట్టనున్న నాలాల డీ సిల్టింగ్ పనులపై జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులతో హైడ్రా కో ఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. వరద ముప్పులేని నగరం అందరి లక్ష్యం కావాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పిలుపునిచ్చారు. ఏప్రిల్ నాటికి నగరవ్యాప్తంగా డీసిల్టింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 

అసాధారణ వర్షపాతం వచ్చినప్పుడు కూడా వరద నీరు సాఫీగా సాగేలా అందరూ బాధ్యతగా పనిచేయాలని సూచించారు. జనవరి నుంచి అన్ని నాలాల్లో డీసిల్టింగ్ పనులు ప్రారంభించాలని.. స్థానికులు, ప్రజాప్రతినిధులను పర్యవేక్షణలో భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు. నాలాల్లో పూడిక తొలగింపులో ఎలాంటి రాజీ ఉండదని కమిషనర్ స్పష్టం చేశారు. 

ALSO READ : తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ఫ్రీ బస్సులు.. ఎక్కడెక్కడి నుంచి అంటే..

కాంట్రాక్టర్లు చెప్పే మాటలు వినకుండా.. ఎక్కడ పూడిక ఉంటే అక్కడ పూర్తిగా తొలగించాలని.. వందలాది మంది సిబ్బంది సమస్య పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. పూడిక తొలగింపు మాత్రమే కాదని.. నాలాల నిర్వహణకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలని కమిషనర్ సూచించారు.