రోడ్లు తవ్వి..  వదిలేశారు..బల్దియా, వాటర్ బోర్డు నిర్లక్ష్యం

 రోడ్లు తవ్వి..  వదిలేశారు..బల్దియా, వాటర్ బోర్డు నిర్లక్ష్యం
  • మూడేండ్ల కింద ప్రారంభమైన పనులు
  • తవ్విన రోడ్లు, స్ట్రామ్ వాటర్, డ్రెయిన్ వర్క్ కు బ్రేక్
  • ప్రమాదాల బారిన పడుతున్న కాలనీల వాసులు
  • ఎల్​బీనగర్ సెగ్మెంట్ పరిధిలోని పలు డివిజన్లలో ఇదీ పరిస్థితి 

ఎల్​బీ నగర్,వెలుగు : ముంపు సమస్యను తొలగించేందుకు ఎస్ఎన్డీపీ(స్ట్రాటజిక్ నాలా డెవలప్​మెంట్​ ప్రోగ్రామ్​)​, జీహెచ్ఎంసీ, వాటర్​బోర్డు మూడు శాఖల అధి
కారులు చేపట్టిన పనులు ప్రమాదకరంగా మారాయి. 2020లో  పనులు ప్రారంభించారు. మూడేళ్లు గడుస్తున్నా ఇంకా పూర్తి చేయలేదు. నత్తనడకన సాగుతుండగా.. కాలనీల వాసులు  ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది. రోడ్లను తవ్వి వదిలేసిన ప్రాంతాల్లో ఎలాంటి హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో ఎవరైనా తెలియక ముందుకెళ్తుండగా అందులో పడి గాయాల పాలవుతున్నారు. ఇక బాక్స్ డ్రెయిన్ పనుల కారణంగా ఏదైనా అనుకోని ఘటన జరిగితే  ప్రాణాలు కోల్పోవాల్సిందే. కార్పొరేటర్ల ఇంటి ముందు కూడా నెలల తరబడి పనులు పెండింగ్​లో ఉంటున్నాయంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో  తెలుస్తుంది. సీసీ రోడ్లను చూస్తే.. బాగా ఉన్న వాటిని తవ్వి పెద్ద బండరాళ్లుగా మార్చేసి నెలల పాటు అలానే ఉంచేశారు. దీనిపై అధికారులను ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని కాలనీల వాసులు మండిపడుతున్నారు. 

అధికారుల నిర్లక్ష్యం కారణంగా..

మన్సూరాబాద్ డివిజన్​లోని అమ్మదయ నగర్ కాలనీలో  సీసీ రోడ్డు వేసేందుకు అప్పటికే ఉన్న రోడ్డును 10 రోజుల కిందట జీహెచ్ఎంసీ అధికారులు తవ్వి వదిలేశారు. మూడ్రోజుల కింద రాత్రిపూట నవీన్ అనే వ్యక్తి  తెలియక అటుగా వెళ్లి ..అందులో పడి గాయపడ్డాడు. నాగోల్ డివిజన్ పరిధి మమతానగర్ కాలనీలోని బాక్స్ డ్రెయిన్ పనుల్లో భాగంగా గుంతలో  వృద్ధుడు జారి పడగా కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. మన్సూరాబాద్ చౌరస్తా మెయిన్ రోడ్​లో  డ్రైనేజ్ మ్యాన్ హోల్ రిపేర్​కు 15 రోజుల కింద ఓ ఇనుప బోర్డును రోడ్డుకు అడ్డంగా  వాటర్​బోర్డు అధికారులు ఏర్పాటు చేశారు. ఇప్పటికీ అది అట్లనే ఉండగా.. ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇలా అధికారుల నిర్లక్ష్యంతో జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

9 ప్రాజెక్టులు చేపట్టగా..

మూడేళ్ల కింద కురిసిన భారీ వానలతో  ఎల్​బీనగర్ సెగ్మెంట్ వరద ముంపునకు గురై అతలాకుతలమైంది. దీంతో జీ‌‌హెచ్‌‌ఎం‌‌సీ, ఎస్‌‌ఎన్‌‌డీపీ, వాటర్​ బోర్డు  అధికారులు సమస్యను పరిష్కరించేందుకు రూ.103 కోట్లతో 9 ప్రాజెక్టులు చేపట్టారు. స్ట్రామ్ వాటర్ వెళ్లేందుకు అధికారులు బాక్స్ డ్రెయిన్ పనులు చేపట్టారు. రోడ్డును ఎక్కడికక్కడ తవ్వి పనులను మధ్యలోనే ఆపేశారు. అధికారుల నిర్వాకంతో జనాలు ప్రమాదాల బారిన పడుతున్నారు. వానాకాలం కావడంతో పడే వానలకు గుంతలు నిండిపోతున్నాయి. 
 

ఈ డివిజన్లలో తీవ్రంగా  సమస్య..

ఎల్​బీనగర్ సెగ్మెంట్ పరిధిలోని లింగోజిగూడ, గడ్డి అన్నారం, కొత్తపేట, హస్తినాపురం, నాగోల్, మన్సూరాబాద్, చంపాపేట, చైతన్యపురి డివిజన్లలో సమస్య ఎక్కువగా ఉంది. మూడు శాఖల అధికారుల నిర్లక్ష్యం కాస్త జనాల ప్రాణాల మీదకు వస్తోంది. ఇబ్బందులను భరించలేక కొన్ని కాలనీల వాసులు ధర్నాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. వాటర్ బోర్డ్ ఆఫీస్, మున్సిపల్ ఆఫీస్ వద్ద నిరసన తెలిపేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.  

ఫోన్​ చేసినా ఎత్తలేదు

రెండ్రోజుల కిందట అమ్మదయ కాలనీలో తవ్విన గుంతలో పడగా మా బంధువుకు గాయాలయ్యాయి. దీనిపై వెంటనే అధికారులకు ఫిర్యాదు చేసేందుకు ఫోన్ చేసినా ఎత్తలేదు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా గాయాల పాలయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి.

 – కృష్ణారెడ్డి, మన్సూరాబాద్

చెప్పినా పట్టించుకోవట్లేదు 

ఎస్ఎన్డీపీ పనులను చేపట్టిన అధికారులు వాటిని మధ్యలోనే వదిలేశారు. తెలియక స్థానికులు గుంతల్లో పడి గాయాల పాలవుతున్నారు. ఇప్పటికే ముగ్గురు గాయపడ్డారు. అధికారులకు ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదు. 

– చెన్నోజు శ్రీనివాస్, గడ్డి అన్నారం