ఏసీబీ అదుపులో అసిస్టెంట్​ సిటీ ప్లానర్​.. బిల్డింగ్ లకు​ ఎన్ వోసీ ఇచ్చేందుకు రూ.8 లక్షలు డిమాండ్

ఏసీబీ అదుపులో అసిస్టెంట్​ సిటీ ప్లానర్​.. బిల్డింగ్ లకు​ ఎన్ వోసీ ఇచ్చేందుకు రూ.8 లక్షలు డిమాండ్
  • భారీగా అక్రమాస్తులు గుర్తింపు?

పద్మారావునగర్, వెలుగు: జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ జోనల్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ విఠల్​రావును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ డీఎస్సీ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ కు చెందిన  వెంకట్రావు జీహెచ్ఎంసీ అనుమతి పొంది, రెండు బిల్డింగ్​లు నిర్మించాడు. వాటికి ఎన్ వోసీ కోసం సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ సిటీ ప్లానర్ విఠల్ రావుకు దరఖాస్తు చేశాడు. భవనాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన నిర్మాణంలో చిన్న చిన్న డీవియేషన్లు ఉన్నాయన్నారు.  ఒక్కో బిల్డింగ్​కు రూ.4 లక్షల చొప్పున ఇస్తే ఎన్ వోసీ ఇస్తానని చెప్పారు. 

అంత ఇచ్చుకోలేనని రూ.4 లక్షలు  ఇస్తానని వెంకట్రావు చెప్పినా కుదరని తెలిపారు. చేసేదిలేక అతను డబ్బులు ఇచ్చేందుకు అంగీకరించాడు. మల్కాజిగిరి సఫిల్ గూడ  చెరువు వద్దకు ప్రభుత్వ వాహనంలో వచ్చిన విఠల్ రావు తొలుత రూ.4 లక్షలు తీసుకున్నారు. మిగతా రూ.4 లక్షల కోసం వెంకట్రావుపై ఒత్తిడి తీసుకువచ్చారు. అతను ఇవ్వకపోవడంతో భవన నిర్మాణ అనుమతుల ఎన్ వోసీ ఫైళ్లను తిరస్కరించాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. 

వారు రంగంలోకి దిగి, శుక్రవారం విఠల్ రావును అదుపులోకి తీసుకున్నారు.  సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలోని ఆయన చాంబర్ లో, మేడిపల్లిలోని ఇంట్లో, కోఠి సుల్తాన్ బజార్​లోని విఠల్ రావు  ప్రైవేట్ కార్యాలయంలో ఏకకాలంలో సోదాలు చేశారు. ఎన్​వోసీ కోసం రూ.4 లక్షలు తీసుకున్నట్లు నిర్ధారించామని డీఎస్సీ  శ్రీధర్ తెలిపారు. అయితే విఠల్ రావుకు భారీ అక్రమాస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించినట్లు తెలిసింది. పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని డీఎస్పీ చెప్పారు.