హైదరాబాద్ ఎన్నికలు.. ఇప్పట్లో లేనట్టే..! మూడు గ్రేటర్లు ఐతే పక్కా..

 హైదరాబాద్ ఎన్నికలు.. ఇప్పట్లో లేనట్టే..! మూడు గ్రేటర్లు ఐతే పక్కా..

హైదరాబాద్ సిటీ, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైనప్పటికీ గ్రేటర్ ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశం లేదని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ స్పష్టం చేశారు. మహానగర ఎన్నికలు ఫిబ్రవరి 10 తర్వాతే జరుగుతాయన్నారు. జీహెచ్ఎంసీ ఒకే కార్పొరేషన్​గా కొనసాగుతుందా లేక మూడు కార్పొరేషన్లుగా విభజన జరుగుతుందా అన్న సస్పెన్స్​కు క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల చైర్​పర్సన్స్, మేయర్ సీట్లతో పాటు వార్డుల వారీగా రిజర్వేషన్లను సామాజిక వర్గాల వారీగా మున్సిపల్ శాఖ శనివారం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. పనిలో పనిగా జీహెచ్ఎంసీ మేయర్ సీటును మహిళ జనరల్ క్యాటగిరీ కింద రిజర్వు చేసింది. దీంతో గ్రేటర్ ఎన్నికలు కూడా ఇప్పుడే జరుగుతాయా ? అని సందిగ్ధత నెలకొంది. ఈ విషయంపై మీడియా చిట్ చాట్​లో ఆర్వీ కర్ణన్ స్పష్టత ఇచ్చారు.

మూడు కార్పొరేషన్​లు.. ముగ్గురు మేయర్లు
గ్రేటర్​ విలీన ప్రాంతాలతో కలిపి కొత్తగా ఏర్పడిన 300 డివిజన్ల రిజర్వేషన్లు ఇప్పట్లో ప్రకటించే అవకాశాల్లేవన్నారు. ఫిబ్రవరి 10వ తేదీతో ప్రస్తుత పాలక మండలి గడువు ముగియనుంది. ఆ వెంటనే, వీలైతే 11న జీహెచ్ఎంసీ పరిధిని మూడు కార్పొరేషన్లుగా విభజించనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం శంషాబాద్ వరకు విస్తరించి ఉన్న జీహెచ్ఎంసీ పరిధిని 150 డివిజన్లతో ఒకటిగా కొనసాగిస్తూ, మిగిలిన 150 వార్డులను రెండు కొత్త గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లుగా (గ్రేటర్ సైబరాబాద్, గ్రేటర్ మల్కాజిగిరి) విభజిస్తారని తెలిపారు. 

ఆ తర్వాత వార్డుల వారీగా రిజర్వేషన్లతో పాటు మేయర్ సీట్ల రిజర్వేషన్లను ఖరారు చేస్తామన్నారు. ఈ మూడు కార్పొరేషన్లకు ముగ్గురు మేయర్లు, ముగ్గురు కమిషనర్లు ఉంటారని కర్ణన్ స్పష్టం చేశారు. మొత్తానికి జీహెచ్ఎంసీ ప్రస్తుత పరిధి మూడు జిల్లాలుగా, మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా, మూడు పోలీసు కమిషనరేట్లుగా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. కొత్తగా గ్రేటర్ సైబరాబాద్, గ్రేటర్ మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించనున్నట్లు వివరించిన ఆయన.. జిల్లా విషయంలో క్లారిటీ ఇంకా రాలేదని 
వ్యాఖ్యానించారు. 

పెద్దన్న.. జీహెచ్ఎంసీనే
ఫిబ్రవరి 10 తర్వాత మూడు కార్పొరేషన్లుగా విభజన జరిగినా, 150 డివిజన్లతో కొనసాగనున్న జీహెచ్ఎంసీ ఇతర రెండు కొత్త మున్సిపల్ కార్పొరేషన్లకు పెద్దన్న పాత్ర పోషించనున్నట్లు సమాచారం. ఐఏఎస్ ఆఫీసర్లు సృజన, వినయ్ కృష్ణా రెడ్డి ఈ రెండు కొత్త కార్పొరేషన్లకు కమిషనర్లుగా నియమించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇక మరో గ్రేటర్ కార్పొరేషన్​గా కొనసాగనున్న జీహెచ్ఎంసీ కమిషనర్ పోస్టును చీఫ్ కమిషనర్​గా సవరించనున్నట్లు తెలిసింది. కొత్తగా ఏర్పడనున్న రెండు కార్పొరేషన్లకు పరిపూర్ణమైన పవర్స్ కేటాయించాలని సర్కారు యోచిస్తున్నట్లు సమాచారం.