హైదరాబాద్ సిటీ, వెలుగు: ఏప్రిల్ నెలాఖరులోగా నల్గొండ ఎక్స్ రోడ్స్– ఓవైసీ జంక్షన్ కారిడార్ పనులు పూర్తి చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. దక్షిణ హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ సమస్యలను తగ్గించేందుకు చేపట్టిన నల్గొండ ఎక్స్ రోడ్స్–సైదాబాద్, ఐఎస్ సదన్–ఓవైసీ జంక్షన్ పనుల పురోగతిని మంగళవారం ఆయన పరిశీలించారు.
ఇప్పటివరకు 80 శాతం పనులు పూర్తయ్యాయని అధికారులు వివరించగా, మిగతా పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా సైదాబాద్ నుంచి ధోబీఘాట్ జంక్షన్ వరకు కీలక ప్రాంతంలో ట్రాఫిక్ డైవర్షన్‌కు అవసరమైన అనుమతులు తీసుకుని పనులు వేగంగా కొనసాగించాలని సూచించారు.
