తార్నాక ఎర్రకుంట చెరువు స్థలం కబ్జాకు యత్నం

తార్నాక ఎర్రకుంట చెరువు స్థలం కబ్జాకు యత్నం
  • 250 గుడిసెలు వేస్తున్నారని డిప్యూటీ మేయర్​కు సమాచారం
  • ఆమె ఫిర్యాదుతో అడ్డుకున్న పోలీసులు గుడిసెల తొలగింపు

హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రభుత్వ స్థలంలో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలని, కబ్జాదారులపై కేసులు ఫైల్​చేయాలని జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్​మోతె శ్రీలతా శోభన్​రెడ్డి కోరారు. తార్నాక ఎర్రకుంట చెరువు స్థలం(సర్వే నంబర్లు121, 122, 123, 125)లో శనివారం తెల్లవారుజామున 250 గుడిసెలు నిర్మిస్తున్నారని స్థానికుల ద్వారా డిప్యూటీ మేయర్​కు సమాచారం అందింది. వెంటనే ఆమె ఓయూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుడిసెలు వేస్తున్న స్థలాన్ని పరిశీలించారు. హైదరాబాద్​కలెక్టర్​అనుదీప్, సికింద్రాబాద్​ఆర్డీఓ సాయిరాంకు సమాచారం ఇచ్చారు. 

చెరువులు, నాలాలు, ప్రభుత్వ స్థలాలను కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, ఇందులో భాగంగానే హైడ్రాను తీసుకొచ్చిందని చెప్పారు. ఎర్రకుంట చెరువు కబ్జాపై హైడ్రా ద్వారా ప్రత్యేక విచారణ చేపిస్తామని తెలిపారు. ఆమెతో టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్ రెడ్డి ఉన్నారు. కాగా, డిప్యూటీ మేయర్​ఫిర్యాదుతో పోలీసులు అక్కడికి చేరుకుని గుడిసెలు వేస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. గుడిసెలను తొలగించారు.