ఇంకా తగ్గని గ్రేటర్ ఎన్నికల వేడి.. పోలైన ఓట్లపై పార్టీల రివ్యూ

ఇంకా తగ్గని గ్రేటర్ ఎన్నికల వేడి.. పోలైన ఓట్లపై పార్టీల రివ్యూ

లెక్కలు వేసుకుంటున్నఓడిన క్యాండిడేట్లు

నియోజకవర్గ స్థాయిలో మీటింగులు

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ ఎన్నికల వేడి ఇంకా తగ్గలేదు. ఫలితాలు వచ్చి 4 రోజులు దాటినా ఓటింగ్ తీరుపై నేతలు ఆరా తీస్తూనే ఉన్నారు. గెలుపోటములపై క్యాండిడేట్లు లెక్కలు వేసుకుంటున్నారు.  డివిజన్ పరిధిలో వచ్చిన ఓట్లు, సామాజిక వర్గాలు, ప్రాంతాలపై సమీక్షించుకుంటున్నారు. ఎన్నికలు, ఫలితాలకు మధ్య మూడు రోజుల గ్యాప్ వచ్చినప్పుడే పార్టీలు వాటి  స్థితిగతులపై అంచనాకు వచ్చినా, రిజల్ట్స్ తర్వాత అవన్నీ మారిపోయాయి. దీంతో గెలిచిన  క్యాండిడేట్స్ కు అత్యధిక ఓట్లు పడ్డ కాలనీల వివరాలపై, ఓడిన క్యాండిడేట్ కు  ఎక్కడ దెబ్బకొట్టిందనే  విషయాలను తెలుసుకునేందుకు ఆయా పార్టీల నేతలు ప్రయత్నిస్తున్నారు. డివిజన్ లోని కాలనీలు, బూత్ ల వారీగా ఓట్లపై సమీక్షించుకుంటున్నారు. ఇక ఎన్నికల ఫలితాలు తారుమారైన డివిజన్లలో క్యాండిడేట్లకు బెడిసికొట్టిన అంశాలపై పరిశీలిస్తున్నారు. గెలిచిన క్యాండిడేట్లు ఓటర్లను కలుస్తుంటే..ఓడిన వారు ఓటమి కారణాలు, ప్రత్యర్థికి కలిసి వచ్చిన అంశాలను విశ్లేషించుకుంటున్నారు.

బూత్ లెవల్ సమీక్షలు

గ్రేటర్​లో ఒక్కో డివిజన్ లో 50 కిపైగా బూత్ లు ఉన్నాయి. ఒక్కో బూత్ లో సగటున 550 మంది ఓటర్లు ఉంటారు. ఈ క్రమంలో పార్టీకి వచ్చిన ఓట్లు, ప్రత్యర్థి ఓట్లు వంటి అంశాలపై ఓడిన క్యాండిడేట్లు లోతుగా చర్చించుకుంటున్నారు. నల్లకుంట డివిజన్ టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం. ఇక్కడ 50 బూత్ లు ఉండగా, ఒక్కో బూత్ లో 700కు పైగా ఓట్లు ఉన్నాయి. పోలింగ్ రోజున 23,498 మంది ఓటేశారు.
ఇందులో టీఆర్ఎస్ కు 9,523 ఓట్లు రాగా..  బీజేపీకి 12,779 మంది ఓటేశారు. 3,253 ఓట్ల మెజార్టీతో బీజేపీ క్యాండిడేట్ ఈ స్థానాన్ని దక్కించుకున్నారు. అయితే ఒక్కసారిగా 3 వేల ఓట్లు ఎక్కడ తగ్గాయంటూ ఓడిన క్యాండిడేట్ తలపట్టుకున్నట్లుగా సమాచారం. ముఖ్యంగా బస్తీల్లో నాలుగేళ్లలో పనులేవీ చేయకపోవడంతో ఆ ఓట్లు భారీగా చీలినట్లు ఆ పార్టీ కార్యకర్తలు చెప్తున్నట్టు సమాచారం. అదే విధంగా సోమాజిగూడ డివిజన్ టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం. ఇక్కడ బీజేపీ తరుఫున బరిలో దిగిన క్యాండిడేట్ కి 7,679 ఓట్లు వస్తే, టీఆర్ఎస్ దాదాపు 3 వేల ఓట్ల మెజార్టీతో గెలిచింది. ఈ డివిజన్ లో టీఆర్ఎస్ కు వ్యతిరేకత ఉందని తెలిసి బీజేపీ తమ క్యాండిడేట్ ను బరిలోకి దింపింది.  కానీ ఆ క్యాండిడేట్ కు డివిజన్ పై పట్టులేకపోవడంతో వెనుకబడినట్లుగా తేలింది. ముషీరాబాద్ లోని గాంధీనగర్ డివిజన్ ను బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. ఇక్కడ టీఆర్ఎస్ ఓటమికి గల కారణం డివిజన్ లోని వరద ప్రభావిత ప్రాంతాల్లోని పోలింగ్ బూత్ లేనని అంచనాకు వచ్చారు. 80 బూత్ లలో టీఆర్ఎస్ కు అనుకూలంగా పోలైన ఓట్లలో 38శాతం మాత్రమే. 50 శాతానికి పైగా ఓట్లు అంటే దాదాపు ఉన్న 15 బస్తీలన్నీ బీజేపీ వైపు నిలిచాయని బూత్ కమిటీ మీటింగ్ లో స్పష్టమైంది.

తగ్గిన ఓట్లపై ఆరా

రాంనగర్ డివిజన్ లో టీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం.. 3వేల మంది ఓటర్లున్న 4 బస్తీలు ముషీరా బాద్ డివిజన్ లో కలవడమేనని ఆ పార్టీ శ్రేణుల విశ్లేషణలో తేలినట్లు తెలి సింది. ఇప్పటికే గెలిచిన క్యాండిడేట్లు సంబురాల్లో ఉన్నారు. బీజేపీ క్యాండిడేట్లు రెట్టించిన ఉత్సాహంతో డివిజన్ లోని కాలనీల్లో పర్యటిస్తు న్నారు.  ముఖ్యంగా బీజేపీ గెలిచిన స్థానాల్లో టీఆర్ఎస్ నేతలు తగ్గిన ఓట్లపై ఆరా తీస్తున్నారు.  ముషీరాబాద్ సెగ్మెంట్ లో ఓడిపోయిన కార్పొరేటర్ ఓట్లు పడని బస్తీల వివరాలను సేకరించా లని నిర్ణయించారని తెలిసింది. ఓట్లను బేరీజు వేసుకుంటూ వచ్చే ఎన్నికల్లో ఓట్లు పడని బూత్ లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పార్టీ నేతలు డివిజన్ ఇన్​చార్జిలకు సూచించారు.