గ్రేటర్ వార్ లైవ్ అప్ డేట్స్

V6 Velugu Posted on Dec 04, 2020

తెలంగాణ ప్రజలకు బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయం

GHMC ఫలితాలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. టీఆర్‌ఎస్‌ మంత్రి కేటీఆర్‌ తప్పుడు ఆరోపణలకు ప్రజలే సమాధానం చెప్పారన్నారు. ప్రజలు ఇచ్చిన సవాల్‌ను TRS ప్రభుత్వం స్వీకరించాలని అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రజల ఆదరణను వేగంగా కోల్పోతుందని విమర్శించారు. తెలంగాణ ప్రజలకు బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమని స్పష్టం చేశారు. 2023లో అధికారానికి రావడానికి గ్రేటర్‌ ఎన్నికలు ప్లాట్‌ ఫామ్‌గా నిలిచిందన్నారు.

కూలిపోతున్న TRS పార్టీలోకి తమ కార్పోరేటర్లు వెళ్లరని స్పష్టం చేశారు కిషన్ రెడ్డి. అంతేకాదు పూర్తి ఫలితాలు వచ్చాక హంగ్‌పై స్పందిస్తామన్నారు. TRS పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. బీజేపీపై టీఆర్‌ఎస్‌ చేసిన తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదని అన్నారు. అక్రమ కేసులు పెట్టినా.. బీజేపీ కార్యకర్తలు వెనకడుగు వేయలేదన్నారు కిషన్ రెడ్డి.

గడీల పాలనను బద్దలు కొట్టే దమ్ము బీజేపీ సొంతం

GHMC ఎన్నికల్లో బీజేపీ భారీ స్థాయిలో డివిజన్లు గెలుచుకోవడంపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంతోషం వ్యక్తం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీదే విజయం అని చెప్పడానికి గ్రేటర్ ఎన్నికల ఫలితాలే నాంది అని స్పష్టం చేశారు. అహంకారంతో విర్రవీగే వారికి ప్రజలే బుద్ధి చెబుతారన్నది మరోసారి తేలిందన్నారు. అంతేకాదు  బీజేపీ అభ్యర్థుల గెలుపును రాష్ట్రఎన్నికల కమిషనర్ పార్థసారధి,  DGP మహేందర్ రెడ్డికి అంకితం చేస్తున్నామని ప్రకటించారు. కార్యకర్తల కంటే ఎక్కువగా SEC, DGP టీఆర్ఎస్ కోసం కష్టపడ్డారన్నారు. సారు, కారు, ఇక రారు.. 2023లో కారు షెడ్డుకు పోవటం ఖాయమన్నారు. అర్థరాత్రి ఎలక్షన్ కమిషనర్ తప్పుడు సర్క్యులర్ ను విడుదల చేయటం దారుణమన్నారు. మంత్రులకు,ఎమ్మెల్యేలకు ఇప్పటికైనా సీఎం కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇవ్వాలని సూచించారు.. గడీల పాలనను బద్దలు కొట్టే దమ్ము బీజేపీ సొంతమన్నారు.గడీ నుంచి సీఎం కేసీఆర్ ను బయటకు తీసుకొస్తామన్నారు. గ్రేటర్ లో గెలిచిన తాము అహంకారాన్ని నెత్తికి ఎక్కించుకోబోమన్నారు. హైదరాబాద్ ప్రజల సమస్యలపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు ఇప్పిస్తామన్నారు. సీట్లు మాత్రమే కాదు.. బీజేపీ ఓట్ల శాతం భారీగా పెరిగాయన్నారు. జాతీయ నాయకుల ప్రచారం బీజేపీకి కలిసొచ్చిందన్నారు బండి సంజయ్.

ఆశించిన ఫ‌లితం రాలేదు

హైద‌రాబాద్ : టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థుల‌కు ఓటు వేసి గెలిపించి ఆశీర్వ‌దించిన హైద‌రాబాద్ ఓటరు మ‌హావ‌యులంద‌రికీ హృద‌య‌పూర్వ‌క ద‌న్యావాదాలు అన్నారు మంత్రి కేటీఆర్ ఎన్నిక‌ల ఫ‌లితాల తర్వాత కేటీఆర్  మీడియాతో మాట్లాడారు. గ‌్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఆశించిన ఫ‌లితం రాలేద‌న్నారు.  ప్ర‌స్తుతం వ‌చ్చిన స్థానాల‌కు అద‌నంగా మ‌రో 20 నుంచి 25 స్థానాలు వ‌స్తాయ‌ని ఆశించామ‌ని తెలిపారు. ఎగ్జిట్ పోల్స్‌ లో కూడా టీఆర్ఎస్ పార్టీ భారీ విజ‌యం సాధిస్తుంద‌ని చెప్పాయన్నారు.

10 -15 స్థానాల్లో స్వ‌ల్ప ఓట్ల తేడాతో ఓట‌మి చెందామ‌ని తెలిపారు.  బీఎన్ రెడ్డి కాల‌నీలో 18 ఓట్ల తేడాతో, మౌలాలిలో 200, అడిక్‌ మెట్‌ లో 200, మ‌ల్కాజ్‌ గిరిలో 70 ఓట్ల స్వ‌ల్ప ఓట్ల తేడాతో త‌మ పార్టీ అభ్య‌ర్థులు ఓడిపోయార‌ని తెలిపారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ప్ర‌జ‌లు ఆశీర్వ‌దించారని ఫ‌లితాల‌పై స‌మీక్ష నిర్వ‌హించుకుంటామన్నారు మంత్రి కేటీఆర్.

ఇప్పటి వరకు బీజేపీ గెలిచిన స్థానాలు

గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ పలు డివిజన్లలో ఆధిక్యంలో ఉంది. ఇప్పటి వరకు గెలిచిన అభ్యర్థులు…

 1. చంపాపేట
 2. హస్తినాపురం- సుజాతా నాయక్
 3. సరూర్ నగర్- ఆకుల శ్రీవాణి
 4. ఆర్కే పురం-రాధా ధీరజ్ రెడ్డి
 5. లింగోజి గూడ-ఆకుల రమేశ్ గౌడ్
 6. గౌలిపుర-ఆలె భాగ్యలక్ష్మి
 7. అడిక్ మెట్- సునితా ప్రకాశ్ గౌడ్
 8. కవాడిగూడ-రచనా శ్రీ
 9. రాం నగర్-కుంతురు రవిచారి
 10. బేగం బజార్-శంకర్ యాదవ్
 11. హయత్ నగర్- కళ్లెం నవజీవన్ రెడ్డి
 12. వనస్థలిపురం-వెంకటేశ్వర్ రెడ్డి
 13. గన్ ఫౌండ్రీ-సురేఖ ఓం ప్రకాశ్
 14. గచ్చి బౌలి-గంగాధర్ రెడ్డి
 15. మోండా మార్కెట్ –దీపిక
 16. మైలార్ దేవ్ పల్లి-
 17. చైతన్య పురి-నర్సింహ రావు
 18. అడ్డి అన్నారం- బద్దం ప్రేమ్ మహేష్ రెడ్డి
 19. కొత్తపేట -పవన్ కుమార్
 20. బాగ్ అంబర్ పేట్- పద్మా వెంకట్ రెడ్డి
 21. జీడిమెట్ల-తారా చంద్రారెడ్డి
 22. హబ్సిగూడ-చేతన
 23. వినాయక్ నగర్-రాజ్యలక్ష్మి
 24. మూసాపేట్: మహేందర్
 25. సైదాబాద్- కొత్తకాపు అరుణ
 26. గాంధీనగర్ –పావని వినయ్ కుమార్
 27. అమీర్ పేట్- కేతినేని సరళ
 28. రామాంతపూర్- బండారు శ్రీవాణి
 29. గుడిమల్కాపూర్-దేవర కర్ణాకర్
 30. జియాగూడ-బోయిని దర్శన్
 31. రాంగోపాల్ పేట-సుచిత్ర
 32. మంగల్ హాట్-శశికళ
 33. జూబ్లీహిల్స్-వెంకటేశ్
 34. మల్కాజిగిరి-శ్రవణ్
 35. మన్సూరాబాద్- కొప్పుల నర్సింహా రెడ్డి
 36. నాగోల్- చింతల అరుణయాదవ్
 37. నల్లకుంట- అమృత
 38. గోషామహల్-లాల్ సింగ్
 39. కాచీగూడ-ఉమారాణి రమేష్ యాదవ్

కొనసాగుతున్న కారు జోరు

గ్రేటర్‌లో టీఆర్ఎస్ మరోసారి జోరు చూపించింది. కాకపోతే కారు జోరుకు బీజేపీ బ్రేకులు వేసింది. ఇంతకు ముందు 99 స్థానాలు గెలుచుకున్న టీఆర్ఎస్.. ఇప్పుడు ఆ స్థాయిలో సీట్లు గెలిచే అవకాశం ఏ మాత్రం కనిపిండంలేదు. మరోవైపు టీఆర్ఎస్‌ను సవాల్ చేసిన బీజేపీ సీట్లలో వెనుకబడిన చాలా చోట్ల నువ్వా.. నేనా అనే రీతిలో పోటీ ఇచ్చింది. పలు చోట్ల టీఆర్ఎస్‌కు బీజేపీ చెమటలు పట్టించింది. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ గణనీయంగా ఓట్లు సంపాదించింది. ఓడిన చోట్ల చాలా తక్కువ ఓట్లతో బీజేపీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు.

సనత్‌ నగర్‌ డివిజన్‌లో టీఆర్ఎస్ విజయం సాధించింది. టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి కొలను లక్మి రెడ్డి దాదాపు 2429 ఓట్ల మెజారిటీ విజయం సాధించారు. సంగారెడ్డి జిల్లా  భారతినగర్‌ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి సింధు ఆదర్శ్ రెడ్డి సుమారు 3900 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ పలు డివిజన్లలో ఆధిక్యం కొనసాగిస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్థి పారిజాతం సుమారు 2025 ఓట్లతో మెజారిటీతో గెలుపొందారు. టీఆర్‌ఎస్‌ అభ్యుర్థుల గెలుపు కొనసాగుతోంది. రంగారెడ్డి నగర్‌ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి విజయ్‌శేఖర్ గౌడ్‌ విజయం సాధించారు. బాలానగర్‌ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ గెలపొందింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి ఆవుల రవీందర్‌రెడ్డి  విజయం సాధించారు. పలు డివిజన్లలో ఆధిక్యంలో ఉన్న బీజేపీ చైతన్యపురిలో గెలుపొందింది. బీజేపీ అభ్యర్థి నర్సింహ గుప్తా  విజయం సాధించారు.

గ్రేటర్ ఎన్నికల్లో పోలైన ఓట్ల కంటే బాక్సులో ఎక్కువ ఓట్లు

GHMC ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. ఈ క్రమంలో కొన్ని ప్రాంతాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. వివేకానందనగర్‌ కౌంటింగ్‌ సెంటర్ లో అధికారుల తీరుపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ డివిజన్‌లో మొత్తం 355 ఓట్లు పోలైతే 574 ఉన్నాయని అధికారులు చెప్పారు. దీంతో పోలైన ఓట్ల కంటే బాక్సుల్లో ఎక్కువ ఓట్లు ఉండడం పట్ల బీజేపీ నేతలు అభ్యంతరాలు తెలుపుతున్నారు. వివేకానంద నగర్ బూత్ నంబర్ 76 బాక్స్‌లకు సీల్ లేదంటూ బీజేపీ ఏజెంట్లు కౌంటింగ్‌ను అడ్డుకున్నారు.

ఈ విషయంపై ఇప్పటికే రిటర్నింగ్ అధికారి సునీతకు ఫిర్యాదు చేశారు. అయితే, ఆమె తమ అభ్యంతరాన్ని లెక్కలోకి తీసుకోలేదని బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. మరోవైపు గోషామహల్ నియోజకవర్గంలోనూ ఇటువంటి ఘటనే జరిగింది. జాంబాగ్ డివిజన్‌లోని బూత్ నెంబర్ 8లో పోలైన ఓట్ల కంటే బాక్స్ లో ఉన్న ఓట్లు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. అయితే… పోలింగ్ శాతమే తప్పుగా ప్రకటించారని అధికారులు చెబుతున్నారు.

ఇప్పటివరకు ఎంఐఎం గెలుపొందిన స్థానాలు

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల కౌంటింగ్‌ ఫలితాలు వెల్లడవుతున్నాయి. డివిజన్ల వారీగా కౌంటింగ్‌ పూర్తైన వివరాలను అధికారులు వెల్లడిస్తున్నారు. ఎంఐఎం పార్టీ గెలుపొందిన స్థానాలు ఈ విధంగా ఉన్నాయి. మోహిదీపట్నం, డబీర్‌ పురా, రామ్‌నస్‌ పురా, దూద్‌బౌలి, కిషన్‌ బాగ్‌, నవాబ్‌ సాహెబ్‌ కుంట, శాస్త్రీపురం, రెయిన్‌ బజార్‌, లలితబాగ్‌, బార్కాస్‌, పత్తర్‌ గట్టి, పురానాపూల్‌, రియాసత్‌ నగర్‌, అహ్మద్‌ నగర్‌, టోలిచౌకి, నానల్‌ నగర్‌, చౌవ్నీ, తలాబ్‌ చంచలం, శాలిబండ, జహనుమలో ఎంఐఎం గెలుపొందింది. మరో 20 నుంచి 25 స్థానాల్లో లీడ్‌లో కొనసాగుతుంది.

షూస్‌ లో సెల్ ‌ఫోన్ ‌తో కౌంటింగ్ కేంద్రంలోకి ఎంఐఎం అభ్యర్థి భర్త

హైదరాబాద్: GHMC ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలోకి అధికారులు సెల్‌ ఫోన్‌ లను నిషేధించిన విషయం తెలిసిందే. అయితే యూసఫ్ గూడ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలోని కౌంటింగ్ కేంద్రానికి ఎంఐఎం పార్టీ అభ్యర్థి షాహినా బేగం భర్త షరీఫుద్దీన్.. అనుమతి లేకుండా సెల్‌ ఫోన్‌ తో ప్రవేశించడం కలకలం రేపింది. ఎవరూ గుర్తించకుండా సెల్‌ ఫోన్‌ ను షూస్‌ లో పెట్టుకుని మరీ కౌంటింగ్ కేంద్రానికి వచ్చారు. దీనిని గమనించిన పోలీసులు వెంటనే షరీఫుద్దీన్‌ ను కౌంటింగ్ హాల్ నుంచి బయటకు తీసుకు వచ్చి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌ కి తరలించారు.

టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ

గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్  ఆసక్తికరంగా మారింది.చాలా డివిజన్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ ఉంది. డివిజన్ లో ఉన్న ఓట్ల కంటే బాక్స్ లో  పోలైన ఓట్ల  సంఖ్య ఎక్కువగా వచ్చింది.యూసఫ్ గూడలో టీఆర్ఎస్ అభ్యర్థికి ఉన్న ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. దీంతో ఫలితాన్ని నిలిపి వేశారు. ఇప్పటి వరకు  టీఆర్ఎస్ 2, ఎంఐఎం 3 డివిజన్లలో గెలిచాయి. టీర్ఎస్ 45,బీజేపీ35,ఎంఐఎం 21 కాంగ్రెస్3 డివిజన్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది.

మైలార్ దేవ్ పల్లి, రాజేంద్రనగర్ డివిజన్ల లో బీజేపీ, టిఆర్ఎస్ మధ్య హోరాహోరీగా కొనసాగుతున్న కౌంటింగ్

బేగంపేట్ లో కౌంటింగ్ హాల్ లో ఎక్కువైన బ్రేక్స్

బేగంపేట్ సర్కిల్ లో కౌంటింగ్ మొదలైనప్పటి నుండి టి బ్రేక్.. లంచ్ బ్రేక్ తప్ప ఏం లేదు. మొదటి రౌండ్ ఫలితాలు కూడా ఇంకా వెలువడలేదు. ఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మాత్రమే వెలువరించారు.

రియాసత్ నగర్ 40 డివిజన్ తొలి రౌండ్ లో ఎంఐఎం ఆధిక్యం
పోలైన ఓట్లు – టీఆర్ఎస్ 856, బీజేపీ 1149, ఎంఐఎం 11237, కాంగ్రెస్ 133, నోటా 68

ఏ.ఎస్.రావు నగర్ డివిజన్ లో కాంగ్రెస్ అభ్యర్థి మొదటి రౌండ్లో 3000 ఓట్లతో లీడ్.

శేరిలింగంపల్లి సర్కిల్(20) పరిధిలో బీజేపీ లీడ్ లో ఉంది

గచ్చిబౌలి డివిజన్ లో టిఆర్ఎస్ అభ్యర్థి పై బిజెపి అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నాడు. శేరిలింగంపల్లి(106) డివిజన్ లో బిజెపి అభ్యర్థి పై టిఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నాడు. కోండాపుర్(104) డివిజన్ లో టిఆర్ఎస్ అభ్యర్థి పై బిజెపి అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నాడు.

యూసఫ్ గూడ కౌంటింగ్ హాల్ లో ఓట్ల లెక్కింపు

యూసఫ్ గూడ కౌంటింగ్ హాల్ లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు. యూసఫ్ గూడ, వెంగల్ రావు నగర్, రహమత్ నగర్ లలో బీజేపీ – టీఆర్ఎస్ మధ్య హోరాహోరి. ఎర్రగడ్డలో ఎంఐఎం, బోరబండలో టిఆర్ఎస్ ఆధిక్యం లో ఉంది.

టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే

జీహెచ్ఎంసీ ఫలితాలపై కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ట్రెండ్ బీజేపీకి అనుకూలంగా ఉందని ట్వీట్ చేశారు. ఓటింగ్ తీరు చూస్తే…ఉద్యోగులు, వృద్దులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని తేలిందన్నారు. గ్రేటర్ లో ప్రజలు టీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయమని నమ్మారని ఫలితాల ద్వారా తేలిందన్నారు విశ్వేశ్వర్ రెడ్డి.

గ్రేటర్‌లో టీఆర్ఎస్ తొలి గెలుపు

జీహెచ్ఎంసీ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ తొలి గెలుపును తన ఖాతాలో వేసుకుంది. యూసుఫ్‌గూడలో టీఆర్ఎస్ అభ్యర్థి రాజ్‌కుమార్ విజయం సాధించారు. ఈ డివిజన్‌లో బీజేపీ నుంచి గంగరాజు, కాంగ్రెస్ నుంచి సత్యనారాయణ, టీడీపీ నుంచి రమేష్ కుమార్ పోటీలో ఉన్నారు.

అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా తన తొలి విజయాన్ని సొంతం చేసుకుంది. ఏఎస్ రావ్ నగర్ డివిజన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి శిరీష గెలుపొందారు. ఈ డివిజన్‌లో టీఆర్ఎస్ నుంచి పావని రెడ్డి, బీజేపీ నుంచి చంద్రిక, టీడీపీ నుంచి నిర్మల పోటీలో ఉన్నారు.

ఉదయం నుంచి మందకోడిగా సాగిన ఓట్ల లెక్కింపు ఒక్కసారిగా ఊపందుకుంది. దాంతో ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి.

గ్రేటర్ రిజల్ట్ .. బోణీ కొట్టిన ఎంఐఎం

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తొలి ఫలితం  వెల్లడైంది. మెహిదీపట్నం డివిజన్లో  ఎంఐఎం విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి మాజీద్ హుస్సేన్ విజయం సాధించారు. గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ ఆసక్తికరంగా జరుగుతోంది. టీఆర్ఎస్ 26 డివిజన్లో, బీజేపీ 21 డివిజన్ లలో అధిక్యం కొనసాగుతోంది. చాలా డివిజన్లలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా సాగుతోంది.

ఈసీ తప్పుకోవాలి.. లేకపోతే తప్పించాలి

అర్థరాత్రి ఎన్నికల కమిషన్  జారీ చేసిన సర్క్యులర్ ను హైకోర్టు నిలిపివేయడం బీజేపీ సాధించిన నైతిక విజయమన్నారు ఆ పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్.  ఎప్పటిలాగానే రాష్ట్ర ప్రభుత్వానికి మరో మొట్టికాయ పడ్డదన్నారు. ఇప్పటికైనా కొంచెం సిగ్గు తెచ్చుకోవాలన్నారు. ఎన్నిసార్లు కోర్టు మొట్టియాలు వేసిన దున్నపోతుమీద వాన పడ్డట్టుగానే పరిస్థితి ఉందన్నారు. అడ్డదారుల్లో గెలవాలని చూసిన టిఆర్ఎస్ పార్టీకి ఇది చెంపపెట్టన్నారు. ఎలక్షన్ కమిషనర్ వెంటనే రాజీనామా చెయ్యాలి..లేదా ప్రభుత్వమే బర్తరఫ్ చేయాలన్నారు. లేకపోతే ప్రజలే టీఆర్ఎస్  ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేస్తారన్నారు. ప్రజా తీర్పును గౌరవించలేని వ్యక్తి ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక అర్హత లేదన్నారు. టీఆర్ఎస్, ఈసీ ఎంత అనైతికంగా వ్యవహరించారో హైకోర్టు సాక్షిగా బట్టబయలైందన్నారు.

ప్రతీ గంటకు పోలింగ్ శాతం ప్రకటించిన  ఎన్నికల కమిషన్ పోలింగ్ రోజున సాయంత్రం 5 నుంచి 6 వరకు జరిగిన పోలింగ్ శాతాన్ని ఎందుకు అప్పటికప్పుడే ప్రకటించలేదన్నారు. 5 నుండి 6 గంటల వరకు 12% నుండి 18% శాతం ఎలా పెరిగిందన్నారు. దీనిపై హైకోర్టు విచారణ జరపాలన్నారు.  కొన్ని పోలింగ్ స్టేషన్ లలో ఉన్నట్టుండి 90% శాతానికి పోలింగ్ పెరిగిందన్నారు. ఇందులో ఏదో గాంబ్లింగ్ జరిగింది అనే అనుమానం ఉందన్నారు. ఇంత దుర్మార్గంగా ఎప్పుడూ ,ఎక్కడా ఎన్నికలు జరగలేదన్నారు. పెన్నుతో టిక్కులు పెట్టిన లెక్కపెట్టుర్రి అని సర్క్యులర్ విడుదల చెయ్యడం చూస్తుంటే అధికారం పోతదేమో అన్న ఆకలి , ఆపతి, ఆతృత కొట్టొచ్చినట్టు కనిపిస్తుందన్నారు. ఎన్నికుట్రలు చేసిన బీజేపీ వైపే ప్రజలు ఉన్నారనడానికి TRS ప్రభుత్వం చేస్తున్న కుట్రలే సాక్షాలన్నారు.

గ్రేటర్ వార్: తొలిరౌండులోనే నువ్వా నేనా అంటున్న టీఆర్ఎస్.. బీజేపీ..

జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. తొలిరౌండ్ ఫలితాలు వచ్చేసరికి టీఆర్ఎస్, బీజేపీ చేరో 12 డివిజన్లలో లీడ్ సాధించాయి. కుర్మగూడ, కిషన్‌బాగ్‌లలో ఎంఐఎం ఆధిక్యంలో ఉంది. ఉదయం నుంచి మందకోడిగా సాగిన ఓట్ల లెక్కింపు ఒక్కసారిగా ఊపందుకుంది. దాంతో ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. మొత్తంగా గ్రేటర్‌లో ఓట్ల కౌంటింగ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. బీజేపీ, టీఆర్ఎస్ పోటాపోటీగా దూసుకెళ్తున్నాయి.

Tagged Hyderabad, Telangana, V6 News, GHMC elections, v6 velugu, TRS party, telangana bjp, GHMC 2020, telangana congress, GHMC Elections Results 2020, GHMC Elections Results 2020 Live Updates

Latest Videos

Subscribe Now

More News