యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో అధ్యయనోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మూడో రోజైన గురువారం ఉదయం రామావతారంలో, సాయంత్రం తిరువేంకటపతిగా నారసింహుడు భక్తులకు దర్శనమిచ్చారు.
సన్నాయి వాయిద్యాలు, మేళతాళాలు, వేదపారాయణాలు, వేద మంత్రోచ్ఛారణల నడుమ శ్రీరాముడు, తిరువేంకటపతి అలంకార సేవలను వైభవోపేతంగా నిర్వహించారు. స్వామివారిని శ్రీరాముడి అలంకారంలో అందంగా ముస్తాబు చేసి ప్రధానాలయ మాడవీధుల్లో ఊరేగించారు.
వజ్ర వైఢూర్యాలు, బంగారు ఆభరణాలు ధరించిన నారసింహుడు.. లక్ష్మీసమేతుడై మాడవీధుల్లో వహరిస్తూ భక్తులను కనువిందు చేశారు. సాయంత్రం తిరువేంకటపతి అలంకారంలో స్వామివారిని ఆలయ తిరువీధుల్లో విహరింపజేశారు.
నర్సన్నను దర్శించుకున్న మంత్రి పొన్నం, విప్ అయిలయ్య
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యతో కలిసి కుటుంబ సమేతంగా స్వామివారి అభిషేక దర్శనంలో పాల్గొన్నారు. ప్రధానాలయ ముఖ మంటపంలో అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం చేసి లడ్డూ ప్రసాదం, స్వామివారి శేషవస్త్రాలు, ఫొటోను అందజేశారు.
