సిట్టింగ్ లకు చుక్కలు చూపిస్తున్న ఓటర్లు

సిట్టింగ్ లకు  చుక్కలు చూపిస్తున్న ఓటర్లు

ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఇంచార్జీలు

అధికార పార్టీకి అడుగడుగునా అడ్డంకులు

హైదరాబాద్, వెలుగు: టీఆర్ఎస్​పార్టీ సిట్టింగ్​క్యాండిడేట్లకు జనం చుక్కలు చూపిస్తున్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో వారిని నిలదీస్తున్నారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను చూసి డివిజన్ల ఇన్​చార్జిలు సైతం షాక్​అవుతున్నారు. టీఆర్ఎస్​కార్పొరేటర్లు 99 మంది ఉండగా 72 మంది సిట్టింగ్ లకు మరోసారి టికెట్లను ఇచ్చారు. వీరితోపాటు గతంలో ఓటమిపాలైన వారిలో చాలామందికి మరోసారి అవకాశమిచ్చారు. అయితే చాలామంది కార్పొరేటర్లకు ఓటర్ల నుంచి చేదు అనుభవం ఎదురవుతోంది. అవకాశమిచ్చిన ఐదేళ్లలో ఏం చేశారని ఓట్లు వేయాలని ఎక్కడికక్కడ టీఆర్ఎస్​క్యాండిడేట్లను ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వరద సాయం డబ్బులు కూడా ఇవ్వకుండా లీడర్లే మింగేశారని ఆరోపిస్తున్నారు.

వరద సాయం.. హామీలపై నిలదీత

మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్ కు మంగళవారం  ప్రచారంలో చేదు అనుభవం ఎదురైంది. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా హిమాయత్​నగర్​లో వారు ప్రచారానికి వెళ్లారు. తమకు వరద సాయం అందలేదని, వరదలతో కష్టాలు పడితే పట్టించుకోలేదని స్థానికులు తిరగబడ్డారు. చేసేదేం లేక వారు అక్కడి నుంచి వెనుదిరిగారు. ఇక ఉప్పల్​లో టీఆర్ఎస్ అభ్యర్థిని నిలదీశారు. వరద సాయం డబ్బులను మీరుమీరు పంచుకొని ఇప్పుడు ఓట్లకోసం మా వద్దకు వస్తారా అంటూ ఎదురుతిరిగారు. అల్వాల్ ఇన్​చార్జిగా ఉన్న ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ప్రచారంలో భాగంగా అభ్యర్థితో కలిసి జనం వద్దకు వెళ్లగా తమకేం చేయలేదని, ఓట్లు ఎలా వేయాలని ప్రశ్నించారు. డబుల్​బెడ్​రూమ్​ఇండ్లు ఇస్తామని ఐదేళ్లయినా ఇవ్వలేదని మండిపడ్డారు. నేతలు  సముదాయించేందుకు ప్రయత్నించినా జనం వినలేదు. గుడిమల్కాపూర్​లోని భోజగుట్ట, వివేకానందనగర్​ కాలనీలో కూడా టీఆర్ఎస్​ నేతలను నిలదీశారు. తమకు డబుల్​బెడ్ రూమ్​ఇండ్లు ఇస్తామని నాలుగేళ్ల క్రితం ఖాళీ చేయించి ఇండ్లు ఇవ్వలేదని మండిపడ్డారు.

ఓట్లడిగే హక్కు లేదు

భోజగుట్టలో రోడ్డుకు దగ్గరున్న మా ఇండ్లు ఖాళీ చేయించి నరకాన్ని చూపిస్తున్నరు. ఇల్లు వస్తుందని నాలుగేళ్లుగా భోజగుట్టలోని వివేకానందనగర్ లో కొండమీద ఉంటున్నం. కొండపైకి వచ్చి వెళ్లేందుకు ఎంతో ఇబ్బంది పడుతున్నం. కీళ్లు, నడుం నొప్పుల బారిన పడుతున్నం. ముసలివాళ్లయితే ఎటూ వెళ్లలేకపోతున్నారు. ఇప్పుడొచ్చి ఓట్లు అడిగితే ఎలా వేయాలి. -మున్నమ్మ, వివేకానందనగర్

వ్యతిరేకత ఉందని తెలిసినా..

సిట్టింగ్ లపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ లీడర్లు అధిష్ఠానం దృష్టికి ముందుగానే తీసుకెళ్లినట్లు సమాచారం. అన్ని నియోజకవర్గాల్లో సగానికి పైగా మార్చాల్సిందేనని పట్టుబట్టారు. కానీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎవరి మాటలు పట్టించుకోకుండా 72 మంది సిట్టింగ్​లకు టికెట్లను ఇచ్చారు. మొన్నటివరకు జనం సమస్యలు పట్టించుకోని కార్పొరేట్లరు ఇప్పుడు ప్రచారానికి వెళ్లడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. సమస్యల పరిష్కారంపై నిలదీస్తున్నారు. వారిని సముదాయించలేక గెలుపు బాధ్యతలను మీదేసుకున్న డివిజన్ల ఇన్​చార్జిలు సతమతమవుతున్నారు.

for more News…

ఆ ఊరిలో అమ్మాయి పుడితే 5వేలు డిపాజిట్.. పెద్దయ్యాక ఊరోళ్లే పెళ్లి కూడా చేేస్తారు

చిన్న పట్టణాల్లో ఉద్యోగాలిస్తాం-బీపీఓ కంపెనీలు

గుడ్లు ఫ్రిజ్​లో స్టోర్​ చేస్తే డేంజర్

వ్యాక్సిన్ పంపిణీకి మెకానిజం రెడీ చేయండి