
జీడిమెట్ల, వెలుగు: హైదరాబాద్ కుత్బుల్లాపూర్ సర్కిల్ ఆఫీస్ గేటువద్ద ర్యాంప్ గ్రిల్స్‌లో కాలు ఇరుక్కుని జీహెచ్ఎంసీ ఉద్యోగి గంటపాటు నరకయాతన అనుభవించాడు. ఆఫీస్గేట్ వద్ద ఇటీవల కొత్తగా ర్యాంప్ ఏర్పాటు చేశారు. సర్కిల్ఆఫీస్లో పనిచేస్తున్న తిరుపతి అనే వ్యక్తి సోమవారం నడుచుకుంటూ వెళ్తుండగా, అందులో అతని ఎడమ కాలు ఇరుక్కుపోయింది. దీంతో ఇతర సిబ్బంది దాదాపు గంటపాటు శ్రమించి కట్టర్ సాయంతో ఇనుప చువ్వలను తొలగించి, అతడి కాలును బయటకు తీశారు. నిబంధనల ప్రకారం కాంట్రాక్టర్ గ్రిల్స్ ను ఏర్పాటు చేయకపోవడంతో ఆఫీస్‌కు వచ్చే తమకు ఇబ్బందులు తప్పడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.