హైదరాబాద్ శివారు ఏరియాల్లో ఉండే పబ్లిక్కు అలర్ట్.. GHMC కమిషనర్ కీలక ఉత్తర్వులు

హైదరాబాద్ శివారు ఏరియాల్లో ఉండే పబ్లిక్కు అలర్ట్.. GHMC కమిషనర్ కీలక ఉత్తర్వులు
  • మానిటరింగ్ ఆఫీసర్లుగా జోనల్ కమిషనర్ల నియామకం
  • లోకల్ బాడీస్ ఖాతాల్లోని బ్యాలెన్స్‌‌.. జీహెచ్ఎంసీ ఖాతాకు బదిలీ
  • జీహెచ్ఎంసీ బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశం

హైదరాబాద్ సిటీ, వెలుగు: శివారులోని ఏడు కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీల విలీనానికి సంబంధించి ప్రభుత్వం జీవో విడుదల చేయడంతో జీహెచ్ఎంసీ కమిషనర్ బుధవారం కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా మున్సిపాలిటీల్లో రికార్డులను స్వాధీనం చేసుకునేందుకు డిప్యూటీ కమిషనర్లకు బాధ్యతలు అప్పగించారు. మానిటరింగ్ ఆఫీసర్లుగా ఆయా జోనల్ కమిషనర్లకు బాధ్యతలు అప్పగించారు. ఈ నెల 5వ తేదీలోపు పూర్తి వివరాలు అందజేయాలని ఆదేశించారు. 

మున్సిపాలిటీ, కార్పొరేషన్లలోని మినిట్స్ బుక్​ను స్వాధీనం చేసుకోవడంతో పాటు లోకల్ బాడీస్ ఖాతాల్లో ఉన్న బ్యాలెన్స్​ను ప్రస్తుత జీహెచ్ఎంసీ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసి.. అక్కడ కొనసాగుతున్న బ్యాంక్ ఖాతాలను క్లోజ్ చేయాలని ఆదేశించారు. అక్కడ ఉన్న బోర్డుల స్థానంలో జీహెచ్ఎంసీ బోర్డుని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

అదే విధంగా భవనాలు, ఉద్యోగుల వివరాల తదితర వివరాలు సేకరించేందుకు 9 రకాల ప్రోఫార్మాను సూచించారు. అర్భన్ లోకాల్ బాడీ ప్రొఫైల్,  అందులో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలు, స్థిరాస్తుల వివరాలు, చరాస్తుల వివరాలు, లోకల్ బాడీ వద్ద ఉన్న డిపాజిట్లు, పెట్టుబడులు,  పన్నులు,  పన్నులు కాని వాటి  డిమాండ్, కలెక్షన్, బ్యాలన్స్, కొనసాగుతున్న పథకాల వివరాలు, చెల్లించాల్సిన పనుల బిల్లులు, సామగ్రి బిల్లులు, గత మూడు సంవత్సరాలలో జారీ చేయబడిన భవనాల అనుమతులు, లేఅవుట్ల అనుమతుల వివరాలు సేరించాలని ఆదేశించారు.