స్పందించకుంటే ఫైన్ పడుద్ది.. నగరంలోని మాల్స్‎పై GHMC ఫోకస్

స్పందించకుంటే ఫైన్ పడుద్ది.. నగరంలోని మాల్స్‎పై GHMC ఫోకస్

హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్‎లోని మాల్స్ ఆస్తి పన్ను చెల్లింపులు, ట్రేడ్ లైసెన్సులపై జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ స్పెషల్​ ఫోకస్ పెట్టింది. కొన్ని మాల్స్ తక్కువ విస్తీర్ణం చూపి పన్ను ఎగ్గొడుతున్నాయని, మాల్స్‎లోని వ్యాపారులు లైసెన్స్ ఫీజులు చెల్లించడం లేదన్న దానిపై దృష్టి సారించింది. గ్రేటర్ పరిధిలో దాదాపు 300 వరకు మాల్స్ ఉన్నట్లు అంచనా వేసిన అధికారులు.. ఈ నెల 8 నుంచి సోమవారం వరకు దాదాపు 200 మాల్స్‎ను గుర్తించి, నోటీసులు జారీ చేశారు.

 నోటీసులు అందుకున్న వాటిలో జీవీకే, సీఎంఆర్, ఫోరం మాల్స్, హైదరాబాద్ సెంట్రల్ మాల్, ఐకియా వంటి పెద్ద మాల్స్ ఉన్నట్లు తెలిసింది. మిగతా వాటికి మంగళవారం  నోటీసులు జారీ చేయనున్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మాల్స్ ను మాత్రం ఈ డ్రైవ్​లో భాగంగా నోటీసుల జారీ ప్రక్రియ నుంచి మినహాయించారు. వచ్చే నెల 14న కోడ్ ముగిసిన తర్వాత ఈ పరిధిలోని మాల్స్ లకు నోటీసులు జారీ చేయనున్నారు. 

చెల్లించకపోతే రెడ్ నోటీసులు, సీజ్‎లు

ఈ నోటీసుల తర్వాత యజమానుల నుంచి వివరణ స్వీకరిస్తారు. ఆ తరువాత మాల్స్ చెల్లిస్తున్న ప్రాపర్టీ ట్యాక్స్‎ను రెసిడెన్సియల్ పరిధిలో గనుక ఉంటే ముందుగా కమర్షియల్ కిందకు మార్చనున్నారు. అలాగే మాల్‎లో ఎంతమంది వ్యాపారాలు నిర్వహిస్తున్నారని గుర్తించి అందరి నుంచి ట్రేడ్ లైసెన్స్ ఫీజును పక్కాగా కలెక్ట్ చేయనున్నారు. నోటీసులకు స్పందించని యాజమాన్యాలను గుర్తించి రెడ్ నోటీసులు జారీ చేయనున్నారు. 

అయినా కూడా స్పందించకపోతే  సీజ్ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మొత్తానికి నగరంలో ఏ ఒక్క మాల్ కూడా సరైన ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించడంలేదని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అందరి నుంచి పన్నులు వసూల్ చేయడమే లక్ష్యంగా ఈ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ డ్రైవ్ ముగిసిన తరువాత  నగరంలోని స్టార్ హోటల్స్ ను టార్గెట్ చేసుకుని ఈ డ్రైవ్ నిర్వహించాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు.