వన్​టైం సెటిల్​మెంట్​తో రూ.757 కోట్ల ఆమ్దానీ

వన్​టైం సెటిల్​మెంట్​తో రూ.757 కోట్ల ఆమ్దానీ

హైదరాబాద్, వెలుగు: ప్రాపర్టీ ట్యాక్స్ స్పెషల్​స్కీములు జీహెచ్ఎంసీకి భారీ ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన 4 నెలల్లోనే వెయ్యి కోట్లు వసూలయ్యాయి. 2022–23 సంవత్సరానికి గాను బల్దియా రూ.2వేల కోట్లు ప్రాపర్టీ ట్యాక్స్​వసూలు చేయాలని టార్గెట్ పెట్టుకోగా, ఏప్రిల్ నెలలో అమలు చేసిన ఎర్లీబర్డ్​స్కీం ద్వారా రూ.740కోట్లు వచ్చాయి. తర్వాత నెమ్మదిగా సాగిన ట్యాక్స్​కలెక్షన్​గత నెల నుంచి అమలు చేస్తున్న ‘వన్​టైం సెటిల్​మెంట్’​ స్కీమ్ ద్వారా మరో రూ.17 కోట్లు వచ్చాయి.

ఈ నెల 3వ తేదీ నాటికి వెయ్యి కోట్లు వసూలు కాగా ఇందులో కేవలం రెండు స్పెషల్​స్కీముల ద్వారా వచ్చిన మొత్తం రూ.757కోట్లు. రెండు నెలలు కిందటి దాకా బల్దియాలోని ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. కొన్ని నెలల్లో 15వ తేదీ దాటాక కూడా జీతాలు పడలేదు. దీంతో కమిషనర్ సహా ఉన్నతాధికారులు అంతా ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్​ పైనే ఫోకస్ పెట్టారు. జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లతో కమిషనర్​లోకేశ్​కుమార్ డైలీ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఫైనాన్స్ విభాగం అడిషనల్ కమిషనర్ అయితే ఏకంగా కలెక్షన్ తీసుకురాని బిల్ కలెక్టర్లకు జీతాలు ఇవ్వబోమని హెచ్చరించారు.

మంచి స్పందన
ప్రాపర్టీ ట్యాక్స్​వసూలులో భాగంగా తెచ్చిన స్కీములకు జనం నుంచి మంచి స్పందన వస్తుందని అధికారులు చెబుతున్నారు. అందుకు ‘ఎర్లీబర్డ్’నే  ఉదాహరణ అంటున్నారు. కేవలం ఏప్రిల్​ఒక్క నెలలో అమలులో ఉన్న దీని ద్వారా రూ.740 కోట్లు వసూలయ్యాయని వివరిస్తున్నారు. అలాగే జులై 17 నుంచి అక్టోబర్​వరకు అమలు చేస్తున్న ‘వన్ టైమ్ సెటిల్ మెంట్’  స్కీమ్ ద్వారా ఇప్పటికే రూ.17 కోట్లు వచ్చాయి. ఇవి కాకుండా రెగ్యులర్ గా కలెక్ట్ అయ్యే మొత్తాన్ని కలిపితే ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు వెయ్యి కోట్లు వచ్చాయని బల్దియా అధికారులు చెబుతున్నారు. ఆర్థిక సంవత్సరం మొదలైన 4 నెలల్లోనే రూ.వెయ్యి కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్​వసూలు కావడం బల్దియా చరిత్రలో ఇదే తొలిసారి అంటున్నారు. ఏప్రిల్​1 నుంచి జులై 31వరకు రూ.994 కోట్లు వచ్చాయని ఈ నెల మొదటి 3 రోజుల్లో మరో రూ.6 కోట్లు వచ్చాయని తెలిపారు. ఇంకా 8 నెలలు ఉండటంతో ఈసారి పూర్తి స్థాయిలో ప్రాపర్టీ ట్యాక్స్​వసూలు అవుతుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం ఫండ్స్​ ఇయ్యట్లే
రాష్ట్ర ప్రభుత్వం నుంచి బల్దియాకు ఎటువంటి ఫండ్స్​రావడం లేదు. కనీసం ప్రభుత్వ భవనాల ప్రాపర్టీ ట్యాక్సులు కూడా చెల్లించడం లేదు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి చేరుకోవడంతో బల్దియా అధికారులు ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్​పై ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. 20 రోజులుగా కురుస్తున్న వర్షాలపై కూడా కమిషనర్​ఈ తరహాలో ఎప్పుడూ టెలీ కాన్ఫరెన్స్ లు నిర్వహించలేదని చెప్పుకుంటున్నారు.