జొమాటో సీఈఓగా దీపిందర్ గోయల్ ఎగ్జిట్.. బ్లింకిట్ బాస్‌కు ప్రమోషన్..?

జొమాటో సీఈఓగా దీపిందర్ గోయల్ ఎగ్జిట్.. బ్లింకిట్ బాస్‌కు ప్రమోషన్..?

ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ జొమాటో స్థాపకులు దీపిందర్ గోయల్ సంచన నిర్ణయం తీసుకున్నారు. కంపెనీ పేరెంట్ సంస్థ అయిన 'ఎటర్నల్' సీఈఓ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం కార్పొరేట్ ప్రపంచంలో పెను సంచలనంగా మారింది. భారతదేశపు స్టార్టప్ రంగంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా పేరుగాంచిన దీపిందర్.. ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన కారణాలు, సంస్థ భవిష్యత్తు ప్రణాళికలు దాగి ఉన్నాయని తెలుస్తోంది. దాదాపు రెండు దశాబ్దాల పాటు జొమాటోను ఒక చిన్న వెబ్‌సైట్ నుంచి వేల కోట్ల విలువైన దిగ్గజ సంస్థగా మార్చిన గోయల్ ఇప్పుడు తన బాధ్యతలను కొత్త తరం నాయకత్వానికి అప్పగించనున్నారు.

దీపిందర్ గోయల్ స్థానంలో జొమాటో క్విక్ కామర్స్ బిజినెస్ యూనిట్ బ్లింకిట్ సీఈఓగా ఉన్న అల్బిందర్ ధీండా ఎటర్నల్ గ్రూప్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా జొమాటో గ్రూప్ కింద ఇప్పుడు జొమాటో ఫుడ్ డెలివరీ, బ్లింకిట్ క్విక్ కామర్స్, హైపర్‌ప్యూర్ సప్లై చైన్, గోయింగ్ అవుట్ ఈవెంట్స్ వంటి నాలుగు ప్రధాన వ్యాపారాలు ఉన్నాయి. ఈ అన్ని విభాగాలను సమన్వయం చేసే 'ఎటర్నల్' సంస్థకు ఒక పూర్తిస్థాయి నాయకుడు అవసరమని భావించి దీపిందర్ ఈ మార్పుకు శ్రీకారం చుట్టారు. ఆయన కేవలం సీఈఓ పదవి నుండి మాత్రమే తప్పుకుంటున్నారు తప్ప.. సంస్థ వ్యవస్థాపకుడిగా కీలక నిర్ణయాల్లో తన పాత్రను కొనసాగిస్తారు.

ఈ మార్పుకు ప్రధాన కారణం వ్యాపార విస్తరణ. జొమాటో ఇప్పుడు కేవలం ఫుడ్ డెలివరీకే పరిమితం కాలేదు. బ్లింకిట్ ద్వారా క్విక్ కామర్స్ రంగంలో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ప్రతి విభాగానికి ఒక స్వతంత్ర సీఈఓను నియమించడం ద్వారా పనితీరును మెరుగుపరచాలని దీపిందర్ యోచిస్తున్నారు. దీనివల్ల ఆయనకు రోజువారీ కార్యకలాపాల నుంచి విముక్తి లభించి.. సంస్థ దీర్ఘకాలిక వ్యూహాలు, కొత్త ఆవిష్కరణలపై దృష్టి పెట్టడానికి సమయం దొరుకుతుంది. నాయకత్వ మార్పు ద్వారా సంస్థలో కొత్త ఉత్సాహాన్ని నింపడం కూడా ఇందులో భాగమని విశ్లేషకులు అంటున్నారు.

►ALSO READ | బడ్జెట్ 2026: మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ నిర్మలమ్మ నుంచి కోరుకుంటోంది ఇవే..

దీపిందర్ గోయల్ తన పదవి నుంచి తప్పుకోవటం అనేది ఒక ముగింపు కాదు. అది జొమాటో ప్రస్థానంలో ఒక కొత్త అధ్యాయం. వ్యవస్థాపకుడిగా ఆయన మార్గదర్శకత్వంలో.. కొత్త సీఈఓ ఆధ్వర్యంలో ఎటర్నల్ సంస్థ గ్లోబల్ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మార్పు ఇన్వెస్టర్లలో కూడా సానుకూల స్పందనను కలిగిస్తోంది. ఎందుకంటే లీడర్ షిప్ పవర్స్ వికేంద్రీకరణ అనేది కార్పొరేట్ గవర్నెన్స్‌లో ఒక మంచి పరిణామంగా పరిగణించబడుతుంది.

మెుత్తానికి తాను సీఈఓ పదవి నుంచి తప్పుకుని దానిని బ్లింకిట్ రథసారధిగా ఉన్న అల్బిందర్ దిండ్సా చేతికి అప్పగించారు గోయల్. తాను మాత్రం కంపెనీ  బోర్డ్ వైస్ ఛైర్మన్ గా కొనసాగుతానని స్పష్టం చేశారు. దీని ద్వారా జొమాటోకి అత్యధికంగా ఆదాయం తెచ్చిపెడుతున్న బ్లింకిట్ విజయానికి కీలకంగా ఉన్న అల్బిందర్ దిండ్సాను ఎటర్నల్ మెుత్తం బాధ్యతలు అప్పగిస్తే కంపెనీ మరింత అభివృద్ధిని సాధిస్తుందని దీపిందర్ గోయల్ ప్లాన్ అయి ఉండొచ్చని నిపుణులు అంటున్నారు.